Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి గెలవలేడా?

By:  Tupaki Desk   |   28 July 2022 7:40 AM GMT
కోమటిరెడ్డి గెలవలేడా?
X
బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఇప్పుడు వారసత్వ రాజకీయాలు దేశంలో అలానే నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కష్టపడి సీఎం అయితే.. ఆయన వారసత్వాన్ని జగన్ కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యమం చేసి సీఎం అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్ తండ్రి అండతో ఇప్పుడు తెలంగాణలో నంబర్ 2గా ఎదిగారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలోనూ రాహుల్ లాంటి వారు ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారు. రాజకీయాల్లో వారసత్వం అనేది నేతలకు ఒక సదావకాశంగా ఉంది. దాన్ని అందిపుచ్చుకున్నవారు అందలం ఎక్కుతున్నారు.

తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల్లో ఫేత్.. సామాజిక సేవ చేసి.. ప్రజల మెప్పు పొంది ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అన్నచాటు తమ్ముడిగా రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రాబల్యం అధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో ఈజీగా గెలిచారు. ఈ అన్నాదమ్ములు ఆర్థికంగా బలంగా ఉండడం కూడా వీరి గెలుపునకు దోహదపడింది.

అయితే గెలిచినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డిది నిలకడలేని మనస్తత్వమే. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరన్న పేరుంది. మునుగోడులో గెలిచిన మూడేళ్లలో కోమటిరెడ్డి పర్యటించిన పాపాన పోలేదన్నది నియోజకవర్గ ప్రజలు ఆడిపోసుకుంటున్నారు. ఫక్తు తన వ్యాపారాలు చూసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటున్నారు. ఇప్పటికే మునుగోడులోని మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, సర్పంచ్, ఎంపీటీసీలు అంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. కోమటిరెడ్డి చేరాలనుకుంటున్న బీజేపీకి అసలు మునుగోడులో నెట్ వర్క్ లేదంటే అతిశయోక్తి కాదు. కోమటిరెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఆయనకు స్థానికంగా ఉండే నేతలే లేరు. ధనబలం తప్ప కోమటిరెడ్డికి ఏమీ లేదు. అది ఎన్నికల్లో పనిచేయదని హుజూరాబాద్ లోనే తేలిపోయింది.వ్యక్తిగత ఇమేజ్, జానకర్షణ, కార్యకర్తల బలం.. ప్రజల్లో అభిమానం ఉంటేనే గెలుస్తారు. కానీ కోమటిరెడ్డికి మునుగోడులో అసలు ఇలాంటివేవీ లేవని అంటున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి.. అన్న వెంకటరెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా.. మంత్రిగా ఎదగడంతో ఆయన పరపతి మీద సీటు సంపాదించాడు. కోమటిరెడ్డి ఫ్యామిలీకి కాంగ్రెస్ కూడా పెద్ద పీట వేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతోపాటు కోమటిరెడ్డి వాళ్ల ఇమేజ్ తోనే రాజగోపాల్ రెడ్డి గెలిచారు.

నిజానికి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో 'లోకల్' క్యాండిడేట్ కాదు. వలస వచ్చి పోటీచేసిన నేతనే. రాజగోపాల్ రెడ్డి క్యాడర్ మొత్తం ప్రస్తుతం టీఆర్ఎస్ లోకి వెళ్లింది.. ఇప్పుడు అతడి వెనుక క్యాడర్ లేదు. హుజూరాబాద్ లో ఈటల గెలిచినట్టు తానూ గెలుస్తానని కోమటిరెడ్డి పోల్చుకుంటున్నాడు కానీ.. ఈటల 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేసి.. ఎన్నో పనులు నియోజకవర్గంలో చేశాడు. అందుకే ఈటలను ప్రజలు మళ్లీ గెలిపించారు. ఈటలపై కేసీఆర్ కక్ష గట్టిన సానుభూతి కూడా పనిచేసింది. కానీ రాజగోపాల్ రెడ్డిపై ఇలాంటి సానుభూతిలు.. అభివృద్ధి చేసిన చరిత్ర లేనేలేదు.

పైగా రాజగోపాల్ రెడ్డి మునుగోడులో నాన్ లోకల్. క్యాడర్ లేనే లేదు. వాళ్ల అన్న కాంగ్రెస్ లో ఉంటూనే అసమ్మతి రాజేస్తున్నారు. ఆయన అంత బలంగా రాజగోపాల్ రెడ్డి లేడు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలో పట్టు లేదు. కోమటిరెడ్డి తీరు నచ్చక మునుగోడు ప్రజలే ఓడించినా ఓడించేస్తారు. కోమటిరెడ్డితో ఎన్నికలకు వెళ్లి గెలవాలనుకుంటున్న బీజేపీకి ఇది కూడా మైనస్ గా మారచ్చు. మళ్లీ గెలవలేడని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాజకీయవర్గాల్లో కూడా టాక్ నడుస్తోంది. వాపు ను చూసుకొని బలుపు అని ముందుకెళితే కోమటిరెడ్డి బొక్క బోర్లా పడడం ఖాయమంటున్నారు.