Begin typing your search above and press return to search.

నయీం బ్యాచ్ లో 99 % టీఆరెస్ నేతలనేట

By:  Tupaki Desk   |   17 Aug 2016 7:19 AM GMT
నయీం బ్యాచ్ లో 99 % టీఆరెస్ నేతలనేట
X
నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారిన నయీం వ్యవహారంలో కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పడు కలకలం రేపుతున్నాయి. నరహంతకుడు నయీం ఉదంతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నయీం ఆగడాల వెనక టీఆరెస్ పార్టీ ఉందని ఆయన అంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నయీం తనను బెదిరించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. నయీంతో సంబంధాలున్న వారిలో 99 శాతం మంది టీఆర్‌ ఎస్ నేతలేనని చెప్పారు.

నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్‌ ఎస్ మంత్రి - ఇతర అధికార పార్టీ నేతలు నయీంను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారన్నారు. తాను 2009లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి నయీం ఆగడాలను ఎదిరిస్తూ వచ్చానని అందుకే తనపై కక్ష పెంచుకున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నయీం డైరీలో ఉన్న వారి వివరాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

నయీం వ్యవహారంలో సంబంధాలున్న కీలక నేతలను రక్షించడానికి - నిజాలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని… నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే నయీం ద్వారా లబ్ధి పొందిన నేతలు - అధికారులను కఠినంగా శిక్షించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తానికి నయీం వ్యవహారంలో ఇంతకాలం మెత్తమెత్తగానే మాట్లాడుతున్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక్కసారి దాడి పెంచినట్లయింది.