Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి కొంప ముంచిన తమ్ముడు.!?

By:  Tupaki Desk   |   27 Jun 2019 4:44 AM GMT
కోమటిరెడ్డి కొంప ముంచిన తమ్ముడు.!?
X
దశాబ్ధాలుగా కాంగ్రెస్ నే నమ్ముకొని ఆ పార్టీలోనే ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ ది మొన్నటి వరకు ఒకటే మాట.. ఒకటే బాట.. ఇద్దరూ కాంగ్రెస్ లోనే ఉంటూ తెలంగాణలో బలమైన నేతలుగా ఎదిగారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు నింపాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తమ్ముడి వల్ల అన్నకు ఎసరు పెట్టేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరడానికి సై అనేసిన వేళ..అన్నయ్యకు దక్కుతుందనుకున్న పీసీసీ పదవికి అధిష్టానం నో చెప్పేసిందట. అన్నయ్యను ముంచేసిన తమ్ముడి వైఖరి చూసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తలపట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్నేళ్లుగా కలిసి రాజకీయం చేశారు. ఇప్పుడు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి సై అనేశారు. తమకు పీసీసీ పీఠం కావాలని.. లేదంటే కాంగ్రెస్ ను వీడుతామంటూ ఆయన ప్రకటనలు చేశారు. దీంతో తమ్ముడితో కాంగ్రెస్ అధిష్టానాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఓ అంచనాకు వచ్చేసింది. అందుకే పార్లమెంట్ లో ఎంపీగా వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ తోటి ఎంపీలు ఎవరూ బల్లలు చరచలేదట.. దీంతో సికింద్రాబాద్ ఎంపీ - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చప్పట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభినందనలు తెలిపారు.

ఈ వ్యవహారం చూడడానికి మామూలుగానే కనిపిస్తున్నా.. కాంగ్రెస్ లో పీసీసీ పీఠం దక్కకపోతే బీజేపీలో చేరడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ రెడీ అయ్యారని కాంగ్రెస్ అధిష్టానం అనుమానిస్తోంది. బీజేపతో కేంద్రమంత్రితో సాన్నిహిత్యాన్ని కాంగ్రెస్ అనుమానంగా చూస్తోంది. ముందు రాజగోపాల్ రెడ్డి వెళ్లి ఆ తర్వాత వెంకటరెడ్డి వెళ్లడానికి రెడీ అయినట్టు సమాచారం అందిందట.. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవికి దూరం పెట్టిందట..

ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు అన్న వెంకటరెడ్డి కొంప ముంచేసిందన్న గుసగుసగలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. తమ్ముడు కాంగ్రెస్ పై అలిగి వెళ్లిపోవడంతో దీనివెనుక వెంకటరెడ్డియే ఉన్నాడని అనుమానిస్తూ కాంగ్రెస్ పీసీసీ పీఠం ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అన్నయ్య వెంకటరెడ్డి తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెబుతున్నా.. తమ్ముడు బీజేపీలో ఉండడంతో అన్నయ్యకు పీసీసీ పీఠం ఇవ్వడం సరికాదన్న అంచనాతో కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ రేసులోంచి వెంకటరెడ్డిని తొలగించిందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇలా తమ్ముడు చేసిన పనికి అన్నయ్య అత్యున్నత కాంగ్రెస్ పదవి చేజారిపోయిందని పార్టీలో చర్చ జరుగుతోంది..