Begin typing your search above and press return to search.

ఒంటరిగా తిరుగుతున్న ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   11 Sep 2019 2:30 PM GMT
ఒంటరిగా తిరుగుతున్న ఎమ్మెల్యే!
X
అదిగో.. భారతీయ జనతా పార్టీలోకి చేరిపోవడమే.. అక్కడ సీఎం అభ్యర్థిత్వాన్ని పొందడమే.. అంటూ హడావుడి చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే ఆయన బీజేపీలోకి మాత్రం చేరడం లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీలోనూ ఇప్పుడు కుదురుకునే పరిస్థితి లేదు. త్వరలో బీజేపీలోకి అంటూ ఆయన ప్రకటనలు చేసి చాలా రోజులు అయ్యాయి. అయితే ఆయన ఎంతకూ ఆ పార్టీలోకి చేరలేకపోతూ ఉన్నారు.

ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ అంటే…దానికి ఎవరూ సమాధానాలు చెప్పలేకపోతూ ఉన్నారు. తన ప్రకటనలతో ఇరు పార్టీలకూ దూరంగా ఉన్నారట ఆయన. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ఆయన ఒంటరిగా వెళ్తూ ఉన్నారని - అటు కాంగ్రెస్ - ఇటు బీజేపీ.. ఏ పార్టీ కార్యకర్తలూ ఆయన వెంట నడిచే పరిస్థితి లేదని టాక్. తన సొంత అనుచరవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఒంటరిగా తిరుగుతూ ఉన్నారట.

కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరాలని ఆయన అనుకున్నారు. అయితే బీజేపీ నుంచి మాత్రం తగిన వెల్కమ్ లేదట. తెలంగాణ బీజేపీ నేతలు ఆయనకు అంతగా సహకరించడం లేదని టాక్. అందులోనూ బీజేపీలోకి చేరడంతోనే తనకు సీఎం అభ్యర్థిత్వం అన్నట్టుగా మాట్లాడటంతో ఆ పార్టీ వాళ్లు ఈయనను అంతగా పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతూ ఉంది.

ఇక అంతగా వెళ్లి బీజేపీలోకి చేరినా.. ఫిరాయింపు నిరోధక చట్ట ప్రకారం ఆయనపై అనర్హత వేటు పడవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ లోకి కొన్ని ఫిరాయింపులు జరిగినా.. వాటికి విలీనం కలరింగ్ ఇచ్చారు కేసీఆర్. దీంతో వాళ్లు సేఫ్ అయ్యారు. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లి బీజేపీలోకి చేరితే ఆయన పై అనర్హత వేటు పడే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యే అవకాశాలున్నాయి. బీజేపీ తరఫున పోటీ చేస్తే విజయం కొశ్చన్ మార్కే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండలేక, బీజేపీలోకి చేరలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు.