Begin typing your search above and press return to search.

నైతికం గెలుపు నాదే.. అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం: రాజగోపాల్‌రెడ్డి

By:  Tupaki Desk   |   6 Nov 2022 12:35 PM GMT
నైతికం గెలుపు నాదే.. అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం: రాజగోపాల్‌రెడ్డి
X
మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజేత‌గా నిలిచారు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమిని అంగీకరించారు. మునుగోడులో అధర్మం గెలిచిందని ఆక్రోశం వెళ్లగక్కారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆ పార్టీ నేతలు ప్రజల్ని బెదిరించారని తెలిపారు. అంతేకాదు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించారు. నైతిక విజయం తనదేనని అన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడు పోయారని రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రజలంతా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేసిందన్నారు. ప్రచారం సమయం ముగిసిన తర్వాత కూడా ఇతర ప్రాంత నేతలు నియోజకవర్గంలోనే ఉన్నారని విమర్శలు చేశారు.

``మునుగోడులో నైతికంగా నాదే విజయం. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి 100 మందికి పైగా మోహరించారు. ఒక్కడినే కౌరవ సైన్యాన్ని తట్టుకుని పోరాడాను. టీఆర్ ఎస్ విజయం అధర్మ గెలుపు. ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలకు పాల్పడింది. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ నిధులు బ్యాంకు ఖాతాల్లో వేసి ప్రలోభ పెట్టారు. ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తామని మంత్రి బెదిరించారు. దుర్మార్గమైన పద్ధతిలో టీఆర్ ఎస్ గెలిచింది`` అని కోమ‌టిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మునుగోడు ప్రజల తరఫున అసెంబ్లీలో ఎంతో పోరాటం చేశానని రాజగోపాల్ పేర్కొన్నారు. ఫామ్‌హౌస్ పాలకులు, ప్రగతిభవన్‌ నేతలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చానని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్‌ చూశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. మోడీ, అమిత్ షా నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.