Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు పొగ‌బెట్టేలా..కోమ‌టిరెడ్డి కొత్త స్కెచ్‌

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:19 AM GMT
రేవంత్‌ కు పొగ‌బెట్టేలా..కోమ‌టిరెడ్డి కొత్త స్కెచ్‌
X
తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వేగంగా సిద్ధ‌మ‌వుతున్నామంటూ ఓ వైపు సిగ్న‌ల్స్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మ‌రోవైపు అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో అత‌లాకుత‌లం అవుతోంది. ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అయ్యే క్ర‌మంలో ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌క‌టించిన క‌మిటీల‌పై అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. ఇప్ప‌టికే సీనియ‌ర్ నేత‌లు వీ హ‌నుమంత‌రావు - పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి ఈ క‌మిటీల కూర్పుపై భ‌గ్గుమంటుంటే..కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కులుగా పేరొందిన కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ సైతం ఈ కూర్పుపై భ‌గ్గుమ‌న్నారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ లో ఒక‌రై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పీసీసీ కమిటీలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. కేవ‌లం క‌మిటీల‌పై అసంతృప్తి మాత్ర‌మే కాకుండా టీడీపీ నుంచి పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై సైతం భ‌గ్గుమ‌న్నారు. పీసీసీ కమిటీలపై బ్రోక‌ర్లకు వేదిక‌గా మారిందంటూ సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు

హైదరాబాద్ నగరశివారులోని అంబర్ పేటలో జరిగిన ఓ స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీలోని ప‌రిణామాల‌పై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని వారికి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారని ప్రజల్లో ఉండే మమ్మల్ని కమిటీలో ఎక్కడో పెట్టారని ఆరోపించారు.నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ కుంతియా త‌మకు శనిలా దాపురించాడని భ‌గ్గుమ‌న్న ఆయ‌న వంద మంది కుంతియాలు వచ్చినా భయపడేది లేదన్నారు. గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెడితే పార్టీ అధికారంలోకి రాదని - కాంగ్రెస్ పార్టీ తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్లే 2014 లో ఓడిపోయామని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యాలు చేశారు. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. త‌ద్వారా త‌మ‌కు కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌లేద‌నే అసంతృప్తి బాహాటంగానే వ్య‌క్త‌ప‌రిచారు.

కాగా, పార్టీ సీనియ‌ర్లైన ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీ‌నివాస్‌ రెడ్డి - మాజీ ఎంపీ వీ హ‌నుమంత‌రావు సైతం నూత‌న క‌మిటీల కూర్పుపై ఇప్ప‌టికే తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వారికి కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ తోడవ‌టం క‌ల‌క‌లంగా మారింది. ఇలా అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో స‌త‌మ‌తం అవుతే...పార్టీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టేది ఎన్న‌డ‌ని హ‌స్తం పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.