Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌!

By:  Tupaki Desk   |   31 Oct 2022 4:21 AM GMT
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌!
X
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికకు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీ నుంచి మునుగోడులో 23 మంది వ్యక్తులు, సంస్థలకు రూ.5.24 కోట్లు బదిలీ చేశారన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. అక్టోబర్‌ 31 సోమవారం సాయంత్రం 4 గంటల లోపు రాజగోపాలరెడ్డి తన వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల్లో పేర్కొంది.

కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ డబ్బు ద్వారా రాజగోపాలరెడ్డి మునుగోడులో గెలవాలనుకుంటున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 23 మంది నేతలకు రాజగోపాలరెడ్డి కంపెనీ సుషీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాల నుంచి రూ.5.24 కోట్లు పంపారని ఆధారాలతో సహా నిరూపించారు.

ఈ మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతా నుంచి అక్టోబర్‌ 14న రూ.5.24 కోట్లు వివిధ నేతలకు బదిలీ చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రాజగోపాలరెడ్డికి నోటీసులు జారీ చేసింది.

మునుగోడు నియోజకవర్గంలోని 28, 29 తేదీల్లో 23 వేర్వేరు వ్యక్తులు/సంస్థలు ఈ నగదును విత్‌డ్రా చేసి ఓటర్లను కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్నారని ఆరోపించారు.

‘మాకు అందిన ఫిర్యాదుల మేరకు.. మీ ఆదేశాల మేరకు మీ కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారా నగదు బదిలీ చేసినట్టుగా వస్తున్న ఆరోపణలపై మీరు సమాధానం ఇవ్వాలి. 23 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడిన ఈ నగదును ఓటర్లను ప్రలోభపెట్టడానికి కాదని నిర్ధారించుకోవడం మీ విధి. కాబట్టి ఈ నోటీసులకు మీ సమాధానం ఇవ్వండి’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో నవంబర్‌ 3న ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలకు సంబంధించి ఎటువంటి బహిరంగ సభ లేదా ర్యాలీ నిర్వహించకూడదని లేదా 48 గంటల పాటు మీడియాలో ఎటువంటి బహిరంగ ప్రసంగాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ప్రచారం సందర్భంగా ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మంత్రిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంతు వచ్చింది. రూ.5.24 కోట్లు పంపారన్న ఆరోపణలపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఈసీ ఆదేశించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.