Begin typing your search above and press return to search.

నేను.. నా బ్రదర్ పోటీ చేయం.. బాండ్ రాసిస్తామంటూ కోమటిరెడ్డి సంచలనం

By:  Tupaki Desk   |   9 Aug 2021 3:16 AM GMT
నేను.. నా బ్రదర్ పోటీ చేయం.. బాండ్ రాసిస్తామంటూ కోమటిరెడ్డి సంచలనం
X
షాకింగ్ వ్యాఖ్యల్ని చేస్తూ.. తరచూ వార్తల్లో కనిపించే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన.. గులాబీ బాస్ ను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఆయన తీరును తప్పుపట్టారు. తాజాగా చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఉద్వేగభరితంగా మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ను ఎంపిక చేసిన నాటి నుంచి నారాజ్ గా ఉంటున్న ఆయన.. తాజాగా ఆ విషయాన్ని పక్కన పెట్టి.. టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

తాను.. తన సోదరుడు.. తామిద్దరం తమ పదవులకు రాజీనామా చేస్తామని.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని.. కావాలంటే బాండ్ పేపర్ కూడా రాసిస్తామన్న కోమటిరెడ్డి.. అందుకు వీలుగా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ ఉన్న పనులు.. రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తే చాలంటూ సంచలన సవాలు విసిరారు. తాము చెప్పిన పనుల్ని పూర్తి చేస్తే.. మళ్లీ రాజకీయంగా ఎన్నికల బరిలో నిలుచోమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.1350కోట్ల మేర ఉన్నాయని.. దీనివల్ల నష్టాల్లో కూరుకుపోయిన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారన్నారు. ప్రభుత్వ పనులంటే చాలు.. చేయటానికి ముందుకు రావటం లేదని.. పనులు చేశాక బిల్లులు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. హిట్లర్ కనుక బతికి ఉంటే.. కేసీఆర్ ను చూసి ఏడ్చేవారన్న కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎంపీ.. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినంత కూడా ఇవ్వట్లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధును తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని వాసాలమర్రిలో చేపడుతున్నప్పటికీ.. తనను మాత్రం పిలవలేదన్నారు. ఆ మాటకు వస్తే.. ఎంపీగా ముఖ్యమంత్రిని కలిసేందుకు గడిచిన రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు ఆయనఅపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. కేబినెట్ లో దళితులకు చోటు ఇవ్వని కేసీఆర్.. దళితబంధు పేరుతో మాత్రం మోసం చేయటం ఆయనకు అలవాటన్నారు.

దళిత బంధు పథకం అనౌన్స్ చేసిన రోజే కేసీఆర్ ఓడిపోయారన్న కోమటిరెడ్డి.. దళితులకు మంత్రివర్గంలో చోటివ్వరు కానీ వారి ఖాతాల్లో మాత్రం రూ.పది లక్షలు వేస్తారా? వారిని మోసం చేస్తున్నారన్నారు. మరి.. తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గులాబీ నేతలు ఎవరైనా స్పందిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.