Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ పై కోమ‌టిరెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు

By:  Tupaki Desk   |   16 Oct 2019 8:36 AM GMT
జ‌గ‌న్‌ పై కోమ‌టిరెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు
X
ఏపీ ముఖ్య‌మంత్రి - వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై తెలంగాణ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో దోస్తీ చేస్తున్నావ్‌.. జాగ్ర‌త్త అంటూ సూచించారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీని అక్కడి సీఎం జ‌గ‌న్‌ ప్రభుత్వంలో విలీనం చేశారని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిప‌డ్డారు. వయస్సులో కేసీఆర్ కంటే చిన్నవాడైనప్పటికీ కార్మికులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారంటూ జగన్‌ ను మెచ్చుకున్నారు.

ఇక ఇదే స‌మ‌యంలో కేసీఆర్‌ కు చుర‌క‌లు అంటించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. హైద‌రాబాద్‌ లోని ఇబ్రహీంపట్నం డిపో ఎదుట తెలంగాణ‌ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి సంద‌ర్శించి - సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని - ధైర్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు తీరుపై మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో మాత్రం ఎందుకు చేయడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌ ను ప్రశ్నించారు.

ఇక్క‌డే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి వ్యూహాత్మ‌కంగా మాట్లాడారు. దివంగ‌త నేత వైఎస్సార్‌ చేసిన మంచి పనులు - కీర్తి వల్లే జగన్ మోహన్ రెడ్డి సీఎంగా గెలుపొందారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆత‌ర్వాత కేసీఆర్‌పై కూడా కోమ‌టిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో సీఎంగా ఉన్న కేసీఆర్ మాత్రం తన కుమార్తెను ఎంపీగా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ లాంటి నేతలతో స్నేహం చేసి జగన్ మోహన్ రెడ్డి తనకున్న మంచి పేరును చెడగొట్టుకోవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

అయితే.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత సీఎం కేసీఆర్‌ ను ప‌లుమార్లు క‌లిసిన విష‌యం తెలిసిందే. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌మస్య‌ల‌ను స‌మ‌న్వ‌యంతో ప‌రిష్క‌రించుకుంటామ‌ని ప‌లుమార్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. అయితే.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌లు వ్యూహాత్మ‌కంగా సీఎం కేసీఆర్‌ ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సూచ‌న‌ల‌పై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో ? చూడాలి మ‌రి.