Begin typing your search above and press return to search.

స్టార్ హోట‌ల్లో డిగ్గీతో కోమ‌టిరెడ్డి...

By:  Tupaki Desk   |   20 Feb 2017 12:22 PM GMT
స్టార్ హోట‌ల్లో డిగ్గీతో కోమ‌టిరెడ్డి...
X
పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాల్లో భాగంగా ఇటీవ‌ల పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసిన‌ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ దిగ్విజ‌య్ సింగ్ భేటీ అయ్యారు. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత హైద‌రాబాద్ వ‌చ్చిన దిగ్విజ‌య్ సింగ్ పార్క్ హయత్ హోటల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా దిగ్విజ‌య్ కి ఇటీవల పరిణామాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ వివరణ ఇచ్చినట్లు స‌మాచారం. అనంత‌రం దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ ఫై కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు వైపులా వాదనలు విన్నానని తెలిపారు. కోమటిరెడ్డి వ్యవహారం పార్టీ అంతర్గతం విషయమ‌ని తాము పరిష్కరించుకుంటామ‌ని వివ‌రించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని అన్నారు. అనంత‌రం హోటల్ నుంచి నాంపల్లిలోని సిటీ మైనారిటీ సెల్ నేత ఇంటికి దిగ్విజ‌య్ సింగ్ వెళ్లారు.

అయితే వివాదానికి కార‌ణ‌మైన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో మాట్లాడిన దిగ్విజ‌య్ సింగ్ పార్టీ కార్యాల‌యమైన గాంధీభవన్ కు రాకుండానే మైనార్టీ నేత ఇంటికి వెళ్లి అటు నుంచి స‌మావేశానికి వెళ్లిపోయారు. పరిగిలో జరిగే జనఆవేధన సమ్మేళన సభలో దిగ్విజయ్ పాల్గొన‌నున్నారు. కాగా, దిగ్విజ‌య్ సింగ్ వ‌స్తార‌ని గాందీభవన్‌ లో వేచిచూసిన పార్టీ నేత‌లు ఆయ‌న స‌రాస‌రి వెళ్లిపోవ‌డంతో నిరాశ చెందారు. మ‌రోవైపు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి-ఉత్తమ్ కుమార్ రెడ్డి మ‌ధ్య వివాదం ముగిసిన అధ్యాయమ‌ని తెలిపారు. అంతా రాజీకుదిరింద‌ని ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై జీవ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా విద్యను ప్రవేటికరణ వైపు ప్రోత్సహిస్తోంది. కేసీఆర్‌ సర్కార్ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురుకుల పాఠశాలలు.. కేజీ టూ పీజీ కి ప్రత్యామ్నాయం కావని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో 15 శాతం వరకు విద్యకు బడ్జెట్ కేటాయింపులు ఉంటే...తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 శాతానికే పరిమితం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఉద్యోగాల నోటిఫికేషన్స్ కేవలం పేపర్స్ కే పరిమితం అవుతున్నాయ‌ని నిరుద్యోగులు ర్యాలీ చేపట్టాలనుకుంటే దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదని జీవ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఇది ప్రజాస్వామ్య పాలనా .. లేక రాచరికపు పాలనా అని పేర్కొంటూ నియంతృత్వ పాలన వైపు అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. ర్యాలీ నిర్వహించాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిణామాలు సిగ్గుచేటని మండిప‌డ్డారు. పోలీసులు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందో కేసీఆర్ గుర్తుచేసుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే జరిగే పరిణామాలకు సర్కార్ బాధ్యత వహించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/