Begin typing your search above and press return to search.

రేవంత్ ఆశలు వదులుకో.. కోమటిరెడ్డి సై!

By:  Tupaki Desk   |   19 Sep 2019 10:34 AM GMT
రేవంత్ ఆశలు వదులుకో.. కోమటిరెడ్డి సై!
X
ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు.. బలహీనులంతా ఏకమై శక్తి కూడదీసుకొని దాడి చేస్తారు. కానీ బలహీనులే నాయకత్వం కోసం ఆధిపత్యం కోసం కొట్టుకుంటే ఏమవుతుంది.. తెలంగాణ కాంగ్రెస్ చింపిన విస్తరవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోందన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి..

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన భార్య పద్మావతినే ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టారు. హుజూర్ నగర్ లో పద్మావతికి టికెట్ ఇవ్వవద్దంటూ రేవంత్ రెడ్డి మరో వ్యక్తి పేరును తెరపైకి తెచ్చాడు. ఉత్తమ్ ఏకపక్ష వ్యవహారశైలిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార బాధ్యుడు కుంతియాకు ఫిర్యాదు చేసి తనకు దగ్గరైన కాంగ్రెస్ నేతలతో లాబీయింగ్ మొదలు పెట్టాడు.

ఈ పరిణామంతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి రేవంత్ వర్గం.. రెండోది ఉత్తమ్ వర్గం. ఇన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల కోసం ఉత్తమ్ - జానారెడ్డి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొట్టుకున్నారన్న ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు బయటి నుంచి వచ్చిన రేవంత్ పార్టీలో కీలకంగా మారడంతో వీరంతా ఒక్కటవుతుండడం విశేషం.

తాజాగా రేవంత్ రెడ్డి రేపిన వివాదంపై కాంగ్రెస్ ఎంపీ - సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ‘రేవంత్ చెప్పే అభ్యర్థి నాకే కాదు ఎవరికీ తెలియదు.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డికి కూడా తెలియదు.. మధ్యలో వచ్చిన రేవంత్ సలహాలు మాకు అవసరం లేదు.. హుజూర్ నగర్ లో పద్మావతియే సరైన అభ్యర్థి.. పీసీసీ చీఫ్ కావాలని నన్ను జానా - ఉత్తమ్ అడిగారు.. ఇన్నాళ్లు మా మధ్య బేధాబిప్రాయలుండేవి కానీ ఇప్పుడు మేం కలిసిపోయాం ’ అంటూ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

దీన్ని పార్టీలో స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్న రేవంత్ ను పాత కాంగ్రెస్ సీనియర్లు అంతా ఏకమై చెక్ పెట్టడానికి రెడీ అయినట్టు కోమటిరెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.