Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌, టీడీపీల్లో అంత‌ర్గ‌త సంక్షోభం

By:  Tupaki Desk   |   23 April 2017 7:02 AM GMT
టీఆర్ ఎస్‌, టీడీపీల్లో అంత‌ర్గ‌త సంక్షోభం
X
త‌నదైన శైలిలో సంచ‌ల‌న కామెంట్లు చేసే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. గాంధీభవన్‌ లో నల్లగొండ జిల్లా పార్టీ సమీక్ష సందర్భంగా సాక్షాత్తు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ దిగ్విజ‌య్‌ సింగ్ సమ‌క్షంలోనే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ గూడూరు నారాయ‌ణ రెడ్డిపై ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కోమ‌టిరెడ్డి చాలా తేలిక‌గా రియాక్ట‌య్యారు. అదో చిన్న సమస్య అని పేర్కొంటూ దాన్ని భూతద్దంలో చూడొద్దని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ లోని విభేదాల గురించి మాట్లాడే నాయ‌కులు ఇత‌ర పార్టీల గురించి సైతం విశ్లేషించాల‌ని కోమ‌టిరెడ్డి కోరారు. టీఆర్‌ ఎస్‌ లో ఒక్కొక్క నియోజకవర్గానికి 12 గ్రూపుల దాకా ఉన్నాయనీ, లోలోపల వారి మధ్య కత్తులతో పొడుచుకునేంత విబేధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీలో కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డికి - ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణకు పడదని కోమ‌టిరెడ్డి విశ్లేషించారు. ఇలా అన్ని పార్టీల్లోనూ విబేధాలు ఉన్న విష‌యం గ‌మ‌నించాల‌ని కోమ‌టిరెడ్డి కోరారు.

కాగా, అధికారంలోకి వచ్చిన మూడేళ్ల‌కు కేసీఆర్‌ కు రైతులు గుర్తుకొచ్చారని కోమ‌టిరెడ్డి విమర్శించారు. అందుకే టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఆయన రైతు జపం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ - మిషన్‌ భగీరథ‌ - మిషన్‌ కాకతీయ వంటి పనుల్లో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మిర్చి పంటకు మద్దతు రాక, కొనే నాథుడు లేక రైతు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్ల కోసమే కేసీఆర్‌ రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని చెప్పారు. రైతులు చస్తుంటే...వందల కోట్లతో కేసీఆర్‌ సభలు పెడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులు మార్కెట్‌ యార్డుల్లో రోజుల తరబడి గడుపుతున్నా...ధాన్యానికి రూ 1200 కూడా రావడం లేదని కోమ‌టిరెడ్డి వాపోయారు. పౌరసరఫరాల శాఖ అధికారులు-మిల్లర్లు కుమ్మక్కైయ్యారని దోచుకుంటున్నారని ఆరోపించారు. ప‌త్తికి బ‌దులుగా కందులు వేసుకోవాలని చెప్పిన కేసీఆర్‌ ఎందుకు కొనిపించ‌డం లేదని కోమ‌టిరెడ్డి ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/