Begin typing your search above and press return to search.

టీపీసీసీ అధ్యక్ష పదవి తనదేనంటోన్న కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   10 Dec 2020 1:36 PM GMT
టీపీసీసీ అధ్యక్ష పదవి తనదేనంటోన్న కోమటిరెడ్డి
X
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ....తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయే స్థాయికి దిగజారింది. బల్దియా బరిలో దిగిన కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ కేడర్ డీలాపడింది. ఇప్పటికే డీకే అరుణ, విజయ శాంతి వంటి కీలక నేతలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఇక, బల్దియా ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఉత్తమ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని నియమించబోతోందన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్ష పదవి తమదేనంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీకి అధ్యక్షుడయ్యేందుకు అన్ని అర్హతలు తనకున్నాయంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో మరో 4 రోజుల్లో తేలిపోతుందని కోమటిరెడ్డి అన్నారు.

అయితే, టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న వ్యవహారంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని కోమటిరెడ్డి చెప్పారు. ఒకవేళ తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కకున్నా కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, బీజేపీలో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. తాను పక్కా కాంగ్రెస్ వాదినని, తనలో ఉన్నది కాంగ్రెస్ రక్తమని, పార్టీలు మారే సంస్కృతి తనది కాదని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని, తనను టీపీసీసీ అధ్యక్షుడిని చేస్తే... వైఎస్సార్ తరహాలో తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ కు పూర్వవైభవ తెస్తానన్నారు. కాంగ్రెస్‌ తోపాటు అన్ని పార్టీలోనూ గ్రూపులున్నాయని, టీఆర్ఎస్‌లో కూడా గ్రూపులున్నాయని కోమటిరెడ్డి అన్నారు. కేటీఆర్‌తో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా సీఎం కావాలని అనుకుంటున్నారని కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. మరి, కోమటి రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు పరిగణిస్తుంది...ఒకవేళ కోమటిరెడ్డిని నియమించకుంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.