Begin typing your search above and press return to search.

కేసీఆర్‌...నిన్ను గ‌జ్వేల్‌ లోనే ఓడిస్తా

By:  Tupaki Desk   |   5 July 2017 4:03 AM GMT
కేసీఆర్‌...నిన్ను గ‌జ్వేల్‌ లోనే ఓడిస్తా
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ పై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మ‌రోమారు నిప్పులు చెరిగారు. న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాలలో జరిగిన కార్య‌క్ర‌మంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్య‌మంత్రిపై ఒంటికాలిపై లేచారు. కేసీఆర్ రూ. 500 కోట్ల రూపాయలతో కట్టుకున్న అద్దాల మేడ నుంచి కాకుండా క్షేత్ర‌స్థాయికి వచ్చి చూస్తే టీఆర్ ఎస్ ప‌రిస్థితి తెలుస్తుంద‌ని అన్నారు. కేసీఆర్ చేస్తున్న సర్వేల్లో వాస్త‌విక‌త లేద‌ని అన్నారు. అడవుల నుండి వచ్చిన న‌కిరేక‌ల్ ఎమ్మ‌ల్యే మళ్లీ అడవులకే పోయే రోజులు ద‌గ్గ‌ర‌కు వచ్చింద‌ని ఎద్దేవా చేశారు. 2019 లో ఎన్నికల్లో మళ్లీ చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తాడ‌ని కోమ‌టిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో, త‌న‌లాంటి వారు మంత్రి పదవులు వదిలి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణా తెస్తే కేసీఆర్ కుటుంబం రాష్ర్టాన్ని ఏలుతోంద‌ని కోమ‌టిరెడ్డి విమ‌ర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్ల‌కు తాకట్టు పెట్టి కొడుకు-బిడ్డ-అల్లుడు రాజ్యం ఏలుతుంటే త‌నలాంటివాని కడుపు మండుతోంద‌ని కోమ‌టిరెడ్డి అన్నారు. కేసీఆర్ అక్ర‌మ సంపాద‌న ద్వారా పొందిన వాటిని త‌మ‌ ప్రభుత్వం వంచి తరువాత వెంటాడి మ‌రీ రికవ‌రి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రూ. 300 కోట్లు పెట్టి చేపలు వేస్తే ఒకటన్న పెరిగిందా అని కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించారు. రైతుల రుణమాఫీ ఒక‌సారి చేయ‌కుండా 4 విడతాలు ఇవ్వ‌డం ద్వారా ఆ నిధులు వడ్డీకే సరిపోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల ఉసురు కేసీఆర్‌ కు తగులుతుంద‌ని శాపం పెట్టారు. దళిత ముఖ్యమంత్రి చేస్తాన‌ని చెప్పార‌ని, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాన‌ని చెప్పి ముఖ్యమంత్రి అయి అనంత‌రం వాటిని తుంగ‌లో తొక్కార‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గజ్వేల్ లో ఒడిస్తామ‌ని కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు. కేసీఆర్‌కు ద‌మ్ముంటే నల్లగొండలో పోటీచేసి త‌న‌ను ఓడించాల‌ని స‌వాల్ విసిరారు. జనవరిలో తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తామ‌ని కోమ‌టిరెడ్డి ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. తాము తెలంగాణ ఎలా ఇచ్చామో ప్రజలకు వివారిస్తామ‌ని, కేసీఆర్ పాల‌న త‌ప్పిదాల‌ని వెళ్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించారు.