Begin typing your search above and press return to search.

దీన‌ర్థం కాంగ్రెస్‌ కు గుడ్ బై అన్న‌ట్లేగా రెడ్డిగారు

By:  Tupaki Desk   |   11 Sep 2017 1:24 PM GMT
దీన‌ర్థం కాంగ్రెస్‌ కు గుడ్ బై అన్న‌ట్లేగా రెడ్డిగారు
X
కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌ బ్రాండ్ లీడ‌ర్లుగా ఎంత పాపుల‌ర్ అయ్యారో అస‌మ్మ‌తివాదులుగా అంతే గుర్తింపు పొందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఆయన సోదరుడు - ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డి త‌మ దారి తాము చూసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్వీకరించేందుకు రెడీగా ఉన్నామ‌ని కోమటిరెడ్డి సోదరులు గ‌త కొద్దికాలం అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విష‌యంలో ఢిల్లీ పెద్ద‌ల నుంచి స్ప‌ష్ట‌త రాలేదు. పైగా వ‌రుస‌గా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. రెండ్రోజుల క్రితం శంషాబాద్‌ లో జరిగిన పార్టీ శిక్షణా తరగతులకు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఆయన సోదరుడైన ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డి హాజరయ్యారు. అయితే పార్టీ నేతలు కోమటిరెడ్డి సోదరులను వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో వారి కార్యకర్తలు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ను వేదిక మీదికి ఆహ్వానించాల‌ని డిమాండ్ చేశారు. అయితే వేదిక మీద‌కు ఆహ్వానం అంద‌లేదు.

ఈ ప‌రిణామం నేప‌థ్యంలో తాజాగా ఓ మీడియా సంస్థ‌తో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీసీసీ నాయ‌క‌త్వంలో మార్పు ఉంటుంద‌ని తాము ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి లాబీయింగ్‌ తో ప‌ద‌వి సంపాదించుకున్నారే త‌ప్ప ఆయ‌న సామ‌ర్థ్యాల‌తో కాద‌ని మండిప‌డ్డారు. ఉత్త‌మ్ వ‌ల్లే తెలంగాణ మూడేళ్ల‌పాటు ఆలస్యం అయింద‌ని ఆరోపించారు. ఆయ‌న సార‌థ్యంలో 2019 ఎన్నిక‌ల‌కు పోతే 5 సీట్లు కూడా ద‌క్క‌వని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి త‌మ‌ను దూరం చేయాల‌నే కుట్ర‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని కోమ‌టిరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, పీసీసీ చీఫ్‌ గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమన్న భావనతో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ అధిష్టానం వద్ధ ఉత్తమ్‌ను తొలగించి పీసీసీ సారధ్య పగ్గాలను తమకు అప్పగించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం వద్ద సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తున్న రాజగోపాల్‌ రెడ్డి గ‌త వారం ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్‌ ను కలిసివచ్చారు. అయితే ఉత్తమ్‌ ను తప్పించేందుకు ఢిల్లీ హైకమాండ్ నుండి సానుకూల స్పందన రాకపోవడం కోమటిరెడ్డి బ్రదర్స్‌ కు మింగుడుపడనిదిగా మారిందని అంటున్నారు. టీపీసీసీ సారధ్యం దక్కని పక్షంలో పార్టీ మారడమా లేక కాంగ్రెస్ - టీడీపీ - జేఏసీల‌ నుంచి కలిసి వచ్చే వారితో కొత్త వేదికతో ఎన్నికలకు వెళ్లడమా అన్న ప్రత్యామ్నాయ రాజకీయ భవిష్యత్ మార్గాలపై బ్రదర్స్ కొద్ది రోజులుగా అంతర్మథనం సాగిస్తున్నారని స‌మాచారం.