Begin typing your search above and press return to search.

అంతే ధీటుగా స్పందించిన కోమ‌టిరెడ్డి

By:  Tupaki Desk   |   19 Oct 2016 6:06 AM GMT
అంతే ధీటుగా స్పందించిన కోమ‌టిరెడ్డి
X
సీఎల్పీ ఉప‌నాయ‌కుడు - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ప్ర‌భుత్వంపై త‌న పోరాటం జోరు మ‌రింత పెంచ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఉన్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితులను ఏ మాత్రం ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై ఆందోళ‌న‌లు చేప‌ట్టనున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొద‌ట రైతుల రుణ మాఫీ - నకిలీ విత్తనాలు ఇతరత్రా రైతుల సమస్యలపై న‌వంబ‌ర్ మొదటి వారంలో ఇందిరా పార్కు వద్ద 72 గంటల పాటు దీక్ష చేపడతానని తెలిపారు. అదిష్టానం అనుమతి తీసుకుని దీక్ష చేపట్టనున్నట్లు విలేఖరుల సమావేశంలో కోమ‌టిరెడ్డి తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బతుకు తెరువు కోసం రాజకీయాలు చేస్తూ పార్టీలు మారుతున్నారని ఆయన విమర్శించారు. గుత్తా రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ఆయనపై తానే పోటీ చేసి విజయం సాధిస్తానని కోమటిరెడ్డి ధీమాగా చెప్పారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. రుణ మాఫీ పూర్తిగా అందకపోవడంతో కొత్త రుణాలు లభించక - పంటలు ఎండిపోయి దీనస్థితిలో ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యాన‌ని, ఆ తర్వాత దశల వారీగా వివిధ ప్రజా సమస్యలపై దీక్షలు నిర్వహిస్తానని కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు. రైతులతో కలిసి రైతు దీక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. మ‌రోవైపు ఆరోగ్యశ్రీ - ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ను మరిచారని - ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని ఆయన తెలిపారు. పేదలకు సరైన వైద్యం అందక అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో ప్ర‌జ‌ వెయ్యి కోట్ల రూపాయలతో సచివాలయం నిర్మిస్తామని చెప్పడం పిచ్చి తుగ్లక్ చర్య అవుతుందని కోమ‌టిరెడ్డి విమర్శించారు. సచివాలయంలో ‘డి-బ్లాక్’ కూలగొడతామని చెప్పడం సరైంది కాదని అన్నారు. వాస్తు లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయరాదని కోమ‌టిరెడ్డి ఎద్దేవా చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆంధ్ర కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల పనులు ఇచ్చి దోచిపెడుతున్నారని కోమ‌టిరెడ్డి విమర్శించారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టే దీక్షకు ఈ సంద‌ర్భంగా మద్దతు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/