Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి.. ఇప్పుడు చూపించండి మీ స‌త్తా..!

By:  Tupaki Desk   |   12 Nov 2021 12:30 PM GMT
కోమ‌టిరెడ్డి.. ఇప్పుడు చూపించండి మీ స‌త్తా..!
X
కోమ‌టిరెడ్డి సోద‌రులు ఇద్ద‌రు కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద మైన‌స్ అయిపోయార‌న్న చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అదిగో పొడిచేస్తాం.. చింపేస్తాం అని కోమ‌టిరెడ్డి సోద‌రులు అన‌డం గ‌త ఆరేడేళ్లుగా కామ‌న్ అయిపోయింది. ఎంత వ‌ర‌కు వీరికి పీసీసీ ప‌ద‌వి కావాల‌న్న ధ్యాసే త‌ప్పా తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేద్దాం అన్న ఆలోచ‌న ఉన్న‌ట్టే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చార‌ని కారాలు మిరియాలు నూరుతోన్న కోమ‌టిరెడ్డి తాను కామారెడ్డి నుంచి పాద‌యాత్ర చేస్తాన‌ని బీరాలు పోతున్నారు.

రేవంత్‌రెడ్డి విష‌యంలోనే కాదు.. అంత‌కు ముందు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కూడా కోమ‌టిరెడ్డి ఎప్పుడూ అధిష్టానంపై ఫైర్ అవుతూ పార్టీని నానా ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. అస‌లు హుజూరాబాద్ ఫ‌లితానికి రేవంత్‌కు లింకు పెట్టి విమ‌ర్శించ‌డం కూడా లాజిక్ లేకుండా ఉంది. బీఫామ్ ఇచ్చేది ఎవ‌రు ? కాంగ్రెస్ హైక‌మాండ్‌.. కోమ‌టిరెడ్డి ఎన్నిసార్లు బీ ఫామ్ తీసుకున్నారు.. ఈ విష‌యం ఆయ‌న‌కు తెలియంది కాదు.

ఇక రేవంత్‌ను పీసీసీ అధ్య‌క్షుడిని చేసింది కూడా కాంగ్రెస్ అధిష్టానమే.. రేవంత్‌రెడ్డి, సోనియా గాంధీయే..! వాళ్ల‌కే ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్‌లో ఉన్న కోమ‌టిరెడ్డిని కాద‌ని.. రేవంత్ రెడ్డికే ఈ ప‌ద‌వి ఇచ్చారంటే కోమ‌టిరెడ్డిపై వాళ్ల‌కే న‌మ్మ‌కం లేదా ? అన్న సందేహాలు క‌లుగ‌క మాన‌వు. కోమ‌టిరెడ్డి చ‌ర్య‌ల వ‌ల్ల కాంగ్రెస్ బ‌ల‌ప‌డ‌డం కంటే ఎంత బ‌ల‌హీన‌ప‌డుతుందో ? అన్న విష‌యం ఆయ‌న తెలుసుకుంటే పార్టీకి, ఆయ‌న‌కు కూడా మంచిదే..!

త‌న‌కు ప‌ద‌వి చూస్తే త‌న త‌డాఖా ఏంటో చూపిస్తాన‌ని కోమ‌టిరెడ్డి ప‌దే ప‌దే చెపుతూ ఉంటారు. మ‌రి ఇప్పుడు ఎవ‌రు మాత్రం ఆయ‌న‌ను త‌డాఖా చూపించ‌వ‌ద్ద‌ని అన్నారు. ఆయ‌న త‌డాఖా చూపిస్తే కాంగ్రెస్‌కే లాభం క‌దా ? మ‌రి ఆ ప‌ని ఎందుకు చేయ‌రు ? పైగా సొంత పార్టీ అధ్య‌క్షుడిని.. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఎందుకు చేస్తారు ? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

నిజంగా కోమ‌టిరెడ్డికి తెలంగాణ‌లో కేసీఆర్‌ను ఢీ కొట్టి కాంగ్రెస్‌ను నిల‌బెట్టే స‌త్తా ఉందని.. ఆ పార్టీ శ్రేణులు భావిస్తే అక్క‌డ కేడ‌ర్‌తో పాటు నాయ‌కులు అంద‌రూ కోమ‌టిరెడ్డి వెంటే ఉంటారు.. మ‌రి కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ వైపు చూసే ఛాన్సే ఉండేది కాదు. మ‌రి కోమ‌టిరెడ్డి ఇప్ప‌ట‌కి అయినా పార్టీని న‌ష్ట‌ప‌రిచే చ‌ర్య‌లు వ‌దిలేసి.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేసేందుకు త‌న వంతు పాత్ర పోషిస్తారా ? లేదా త‌న పంథాలోనే ముందుకు వెళ‌తారా ? అన్న‌ది చూడాలి.