Begin typing your search above and press return to search.

త‌గ్గేదేలే అన్న కోమ‌టిరెడ్డి త‌గ్గిన‌ట్లున్నారు

By:  Tupaki Desk   |   7 Jan 2022 10:58 AM GMT
త‌గ్గేదేలే అన్న కోమ‌టిరెడ్డి త‌గ్గిన‌ట్లున్నారు
X
ఒక మాట మీద ఉండ‌ని వాళ్ల‌నే రాజ‌కీయ నాయ‌కులు అంటార‌ని ప్ర‌జ‌లకు ఎప్ప‌టినుంచో తెలుసు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఆ స‌మ‌యానికి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసే పొలిటిక‌ల్ నేత‌లు ఆ త‌ర్వాత ఆ మాట‌లు మార్చ‌డం ఎన్నో సార్లు చూశాం. అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. ఈ మాట‌ల గార‌డీ నాయ‌కుల‌కు తెలిసిన విద్యే. మాట త‌ప్ప‌డం సాధార‌ణ‌మే. మ‌రి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటారా?.. గ‌తంలో ఓ శ‌ప‌థం చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఇప్పుడు దాన్ని గ‌ట్టు మీద పెట్ట‌డ‌మే కార‌ణం.

ఆ అసంతృప్తితో..

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌గా.. భువ‌న‌గిరి ఎంపీగా వెంక‌ట్‌రెడ్డి కొన‌సాగుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న మంత్రిగానూ ప‌ని చేశారు. అలాంటి రాజ‌కీయ అనుభ‌వం ఉండి.. మొద‌టి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే కొన‌సాగుతున్న ఆయ‌న తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించారు. కానీ అధిష్ఠానం దాన్ని రేవంత్‌రెడ్డికి క‌ట్ట‌బెట్ట‌డంతో వెంక‌ట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌ను కాద‌ని.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌ను అందెలం ఎక్కిస్తారా అని బ‌హిరంగంగానే తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. డ‌బ్బులిచ్చి రేవంత్ రెడ్డి ప‌ద‌వి తెచ్చుకున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. అతే కాకుండా రేవంత్ రెడ్డి అధ్య‌క్షుడిగా కొన‌సాగినంత కాలం గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌న‌ని శ‌ప‌థం కూడా చేశారు.

కానీ ఇప్పుడు..

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా నియామ‌కం అయిన త‌ర్వాత వెంక‌ట్‌రెడ్డి పార్టీతో అంటీ ముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రేవంత్ ఆధ్వ‌ర్యంలో పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగానే ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ దారుణ ఫ‌లితాల‌పై నాయ‌క‌త్వాన్ని విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత వివిధ సంద‌ర్భాల్లోనూ త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. కానీ పార్టీలో సీనియ‌ర్ అయిన నాయ‌కుడు ఇలా ఉంటే అది పార్టీకి మంచిది కాద‌ని భావించారేమో కానీ అధిష్ఠానం ఆదేశాల‌తో ఆయ‌న అసంతృప్తిని చ‌ల్లార్చుకున్న‌ట్లే క‌నిపిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నంత కాలం పార్టీ అధికార కార్యాల‌యం అయిన గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌ను అని చెప్పిన ఆయ‌న.. ఇప్పుడు తొలిసారి గాంధీభ‌వ‌న్‌కు వ‌చ్చారు. రేవంత్ విష‌యంలో త‌గ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న తాజా ప‌రిణామంతో త‌గ్గార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా గాంధీభ‌వ‌న్‌లో విలేక‌ర్ల స‌మావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంతో త‌గ్గ‌డంలో త‌ప్పేమీ లేద‌ని అది వెంక‌ట్‌రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు మేలు చేసేదేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.