Begin typing your search above and press return to search.

పూట‌కో పార్టీ మారేందుకు నేనేమీ 'గుత్తా' కాదు

By:  Tupaki Desk   |   3 Oct 2017 4:26 AM GMT
పూట‌కో పార్టీ మారేందుకు నేనేమీ గుత్తా కాదు
X
త‌నదైన శైలిలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు - సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ ద‌ఫా ఎప్ప‌ట్లాగే తాను ఎమోష‌న‌ల్ అయిపోయి మాట్లాడ‌టం కాకుండా...ప్ర‌త్య‌ర్థిని ఎమోష‌న్ అయ్యేలా చేశారు. న‌ల్ల‌గొండ ఉప ఎన్నిక హ‌డావుడి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ ఈ సంద‌ర్భంగా సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై పంచ్‌ లు పేల్చారు.

కాంగ్రెస్ పార్టీలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఉండ‌బోర‌ని - బీజేపీలో చేర‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రచారంపై కోమ‌టిరెడ్డి స్పందిస్తూ...``పూటకో పార్టీ మారటానికి నేనేమీ గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదు. ప్రాణమున్నంత వరకూ కాంగ్రెస్‌ లోనే ఉంటా. అధిష్టానం టీపీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇస్తే 2019లో తెలంగాణలో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తీసుకొస్తా' అని మరోమారు నొక్కిచెప్పారు. త్యాగాల తెలంగాణ కుటుంబ పాలన పరమైందని కోమ‌టిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండలో ఉపఎన్నిక నిర్వహించటానికి కేసీఆర్‌ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నల్లగొండకు ఉప ఎన్నిక వస్తే - అధిష్టానం ఆదేశిస్తే తన సత్తా చాటి కాంగ్రెస్‌ ను గెలిపిస్తానని ప్రకటించారు. ఎవరిని నిలబెట్టినా గెలుపునకు కృషి చేస్తానని కోమ‌టిరెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నిక నుంచే రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ పతనానికి నాంది పలుకుతానన్నారు.

తెలంగాణ ప్రజలు గొర్రెలు - బర్రెలు - చేపలు - చీరలు కోరడం లేదని నిధులు - నీళ్లు నియమకాల పేరుతో అధికారంలోకి వచ్చినందుకు ఉద్యోగాలు కోరుతున్నారని కోమ‌టిరెడ్డి చెప్పారు. బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో మూడెకరాల భూమి కోసం దళితులు బలిదానాలు చేసుకోవాల్సి రావడం కేసీఆర్‌ ప్రభుత్వానికే సిగ్గు చేటని కోమ‌టిరెడ్డి మండిప‌డ్డారు. 30 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను ముఖ్యమంత్రి దగా చేశాడని కోమ‌టిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కింద విడుదల చేసిన డబ్బు రైతుల అప్పుల వడ్డీలకే సరిపోయిందన్నారు. ప్రజల కష్టాలను చూడటానికి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ వీడి ప్రజల్లోకి రావాలని డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల సామాన్యులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కోమ‌టిరెడ్డి అన్నారు.