Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి సర్వేలో కాంగ్రెస్ కు 95 సీట్లు

By:  Tupaki Desk   |   11 March 2016 7:57 AM GMT
కోమటిరెడ్డి సర్వేలో కాంగ్రెస్ కు 95 సీట్లు
X
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ వ్యూహాల్లో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు గురించీ తెలిసిందే. అందుకే ఆమధ్య టీఆరెస్ జోరులోనూ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎమ్మెల్సీగా గెలవగలిగారు. కోమటిరెడ్డి కుటుంబం నడిపించే రాజకీయాల్లో వెంకటరెడ్డిదే ప్రధాన పాత్ర. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా అవసరమైన పనులు చేయించుకోవడంలో ఆయన తెలివితేటలు చూపిస్తుంటారు. ఆ సంగతి రీసెంటుగా ఆయనే వెల్లడించారు. అలాంటి కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మళ్లీ బతికించడానికి ఏదో పెద్ద ప్లానే గీస్తున్నారట. 2019 ఎన్నికల్లో ఏకంగా 95 స్థానాలను గెలుచుకుంటామని ఆయన చెబుతున్నారు. ఏ లెక్కన ఆయన చెబుతున్నారో ఏమో కానీ, ఆ సంగతి మాత్రం అప్పుడే బయటపెట్టొద్దని కూడా ఆయనే కోరుతున్నారు. సీఎం కేసీఆర్ తో కొన్ని పనులున్నాయని... అవి అయిపోయిన తరువాత టీవీల్లో వేసుకోవాలని ఆయన మీడియాకు సూచించారట.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీసెంటుగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన 2018 నుంచి మళ్లీ యాక్టివ్ అయి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 95 సీట్లు గెలుచుకునేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి రెస్టులో ఉన్నామని అన్నారు. అయితే... సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కేసీఆర్ ను కలవడానికి వెళ్తున్నానని... ఆ పని పూర్తయ్యాకే ఈ 95 సీట్ల విషయంలో టీవీల్లో వేయాలని ఆయన అన్నారట. అంతవరకు వేస్తే కేసీఆర్ తనకు పనిచేయరని కూడా కోమటిరెడ్డి అన్నారు. అంతేకాదు... గతంలోనూ ఇలాగే జరిగిందంటూ ఓ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉదాహరణగా చెప్పారు.

నల్గొండజిల్లాలో బ్రాహ్మణపల్లి ప్రాజెక్టు విషయంలో తాను గతంలో కేసీఆర్ ను కలవగా వెంటనే ఆయన ఈఎన్సీకి ఫోన్ చేశారని... పనులు మొదలయ్యాయని.. అయితే, ఒకట్రెండు రోజుల్లో తాను కేసీఆర్ ను విమర్శించడంతో వెంటనే ఆ పనులు ఆగిపోయాయని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజకీయం మామూలుగా లేదు కదా.