Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ రావు స‌భ‌కు..కోమ‌టిరెడ్డి జ‌న‌సమీక‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   16 May 2017 11:08 AM GMT
హ‌రీశ్‌ రావు స‌భ‌కు..కోమ‌టిరెడ్డి జ‌న‌సమీక‌ర‌ణ‌
X
త‌న్నీరు హ‌రీశ్ రావు...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర మంత్రి. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - అధికార పార్టీ అంటే ఇంతెత్తున్న ఎగిరిప‌డే వ్య‌క్తి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య దోస్తీ - ఒక‌రి కోసం ఒక‌రు ప‌నిచేయ‌డం అనేది ప్ర‌స్తుత ప‌రిణామాల్లో ఒకింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. కానీ అలాంటి మితృత్వం తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రి హ‌రీశ్ రావు స‌భ కోసం కోమ‌టిరెడ్డి జ‌న స‌మీక‌ర‌ణ చేస్తున్నారు. నల్గొండ జిల్లా - నార్కట్‌ పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లెం గ్రామంలో నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం విష‌యంలో ఈ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది.

వ‌చ్చే జూన్ నాటికి ఉద‌య‌స‌ముద్రం ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేస్తామని ప్ర‌క‌టించిన‌ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఈ మేరకు సమయం దగ్గరపడటంతో పనుల‌ను ప‌రిశీలించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. నల్గొండలో పర్యటించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు, బత్తాయి మార్కెట్ ను నల్గొండ పర్యటనలో భాగంగా హరీశ్ రావు ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఈ సభ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనసమీకరణ చేస్తున్నారు. దీనికి త‌న‌దైన శైలిలో కార‌ణాలు చెప్తున్నారు కోమటిరెడ్డి.

ఉదయసముద్రం ప్రాజెక్టు నిర్మాణం - బత్తాయి మార్కెట్ సాధనే తన జీవిత ఆశయమని చెప్పిన కోమటిరెడ్డి ఈ క‌ల నెర‌వేరుతున్న క్ర‌మంలో మార్కెట్ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి కార్య‌క్ర‌మాలు అయిన ప్రాజెక్టు నిర్మాణం, మార్కెట్ యార్డు ప్రారంభం సందర్భంగా.. రాజకీయాలకు అతీతంగా రైతులు తరలిరావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కాగా, హరీశ్ రావుతో పాటు మరో మంత్రి జగదీశ్‌ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే త‌మ పార్టీ నేత‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు కూడా జనసమీకరణకు సిద్ధ‌మ‌య్యాయి. దీంతో స్థానికంగా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కాంగ్రెస్ శ్రేణులకు, టీఆర్ ఎస్ శ్రేణులకు ఎక్కడా ఘర్షణ చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. స‌భ విజ‌య‌వంతం అయ్యేందుకు ఇరు వ‌ర్గాలు కృషిచేయాల‌ని పోలీసులు కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/