Begin typing your search above and press return to search.

సీఎం కుర్చీ.. కోమటిరెడ్డి ఇన్ డైరెక్ట్ కోరిక ఇదీ!

By:  Tupaki Desk   |   14 Oct 2022 1:30 AM GMT
సీఎం కుర్చీ.. కోమటిరెడ్డి ఇన్ డైరెక్ట్ కోరిక ఇదీ!
X
మహాసముద్రంలాంటి కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ ను తిట్టొచ్చు. ఆ పార్టీలోనే అసమ్మతి రాజేయచ్చు. అంతటి స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఆ పార్టీ సొంతం. తమ్ముడు బీజేపీలో చేరినా అన్న కాంగ్రెస్ లో ఉంటూ తమ్ముడి గెలుపుకోసం ట్రై చేయవచ్చు. ఇది కాంగ్రెస్ నయా రాజకీయం అన్న ఆరోపణలున్నాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్ ఆది నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. అనువు చూసి తమ రాజకీయ అవసరాలు తీర్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడంతోనే అసలు రాజకీయం మొదలైంది. అన్న వెంకటరెడ్డి బీజేపీలో చేరుతాడని ప్రచారం సాగింది.కానీ ఆయన చేరలేదు. తమ్ముడికి సపోర్టు చేస్తూ వాట్సాప్ కాల్స్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చినా ఖండించారు.

ఇక తాను చచ్చేవరకూ కాంగ్రెస్ లోనే ఉంటానని సోనియాగాంధీకి మాట ఇచ్చానని వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండాలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి తెలంగాణ పోరాట సమయంలోనే సోనియాకు మాట ఇచ్చానని.. ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఈ హామీ నెరవేరుస్తానన్నారు.

ఇక తనకు మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అవసరం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు.కానీ పార్టీ పదవిని మాత్రమే ఆశించానని తెలిపారు. అది దక్కలేదని ఆవేదన చెందారు.కాంగ్రెస్ పార్టీలో ముందస్తుగా టికెట్లు ప్రకటించరని.. కానీ ఈసారి సర్వే చేసి 6 నెలల ముందుగా టికెట్లు ప్రకటించాలని సూచించారు.

ఇక వెంకటరెడ్డి అనుకుంటున్నట్టు ఆయన పార్టీ పదవి అయిన 'పీసీసీ' ఇస్తే నెక్ట్స్ సీఎం ఆయనే. ఎందుకంటే నాడు వైఎస్ఆర్ కూడా ఇలానే పీసీసీ పదవి కొట్టి పాదయాత్ర చేసి అనంతరం గెలిపించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయననే సీఎం చేయాల్సిన క్లిష్ట పరిస్థితులు కాంగ్రెస్ కు ఎదురయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ చీఫ్ నే తర్వాత అధికారంలోకి తీసుకొస్తే సీఎం అవుతారు. ఆ లాజిక్ తెలుసు కనుకనే వెంకటరెడ్డి ఇలా తనకు సీఎం సీటు వద్దు.. పార్టీ పదవి ముద్దు అంటున్నారని పలువురు కాంగ్రెస్ వాదులు లూప్ హోల్స్ వెతికి మరీ గుసగుసలాడుకుంటున్నారు. సీఎం కుర్చీని వెంకటరెడ్డి ఇన్ డైరెక్టుగా పొందాలని చూస్తున్నారని వారంతా అనుమానిస్తున్నారు.