Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డికి కాంగ్రెస్ షాక్‌.. నోటీసులు.. వేటు త‌ప్ప‌దా?!

By:  Tupaki Desk   |   23 Oct 2022 12:37 PM GMT
కోమ‌టిరెడ్డికి కాంగ్రెస్ షాక్‌.. నోటీసులు.. వేటు త‌ప్ప‌దా?!
X
కాంగ్రెస్ పార్టీ కీల‌కంగా భావిస్తున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దుతు ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్లు చేసి, విజ్ఞప్తులు చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల జబ్బర్ అనే ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి సోదరుడు రాజగోపాల్ రెడ్డికి అన్ని విధాలుగా ఆదుకోవాని, పార్టీలకు అతీతంగా మద్దుతు ఇవ్వాలని కోరిన వాయిస్ రికార్డ్ ప్రింట్, సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కోమటిరెడ్డి వాయిస్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్య కమిటీ దృష్టికి వెళ్లింది. దీంతో ఏఐసీసీ సెక్రెటరీ తారీఖ్ అన్వర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ''మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరిన వాయిస్ రికార్డ్ వైరల్ అవుతోంది.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది.. మీ వైఖరి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది.. పది రోజుల్లోగా మీ మీద ఎందుకు చర్య తీసికొరాదో వివరణ ఇవ్వండి..'' అంటూ ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ పార్టీలో గుంభ‌న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోవైపు.. పార్టీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పోటీ చేయడం.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్లో ఉండడంతో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందంటూ ఇటీవల ఓ కార్యకర్తతో కోమటిరెడ్డి మాట్లాడారు. తాను ప్ర‌చారం చేసినా.. లాభం లేద‌ని.. కేవ‌లం 10 వేల ఓట్ల‌కు మించి రావ‌ని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనను వివరణ కోరింది. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

అయితే.. ఈ నోటీసుల‌కు వెంక‌ట‌రెడ్డి ఎలాంటి స‌మాధానం చెబుతార‌నేది ఆస‌క్తిగా మారితే.. మ‌రోవైపు.. రేవంత్ రెడ్డి వ‌ర్గంగా ఉన్న కొంద‌రు నాయ‌కులు మాత్రం వెంక‌ట‌రెడ్డిపై వేటు వేయాల‌నే కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వెంక‌ట‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం స‌స్పెన్ష‌న్ వేటు వేసే అవ‌కాశం మెండుగా ఉంద‌నే గుస‌గుస పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి పార్టీ ఏం చేస్తుందో చూడాలి.