Begin typing your search above and press return to search.
శ్రీనివాస్ హత్య వెనుక సర్కార్ హస్తం..కోమటిరెడ్డి!
By: Tupaki Desk | 29 Jan 2018 4:02 PM GMTనల్గొండ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ మిర్చి లారీ దగ్గర ఏర్పడిన వివాదం నేపథ్యంలో శ్రీనివాస్ ను అతడి స్నేహితులే హత్య చేశారని - ఈ కేసుకు సంబంధించిన 8 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అయితే, శ్రీనివాస్ ను పథకం ప్రకారమే హత్య చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే - డీఎస్పీ కలిసి పథకం ప్రకారం ఈ హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయస్తామని కూడా చెప్పారు. తాజాగా, ఈ హత్యలో తెలంగాణ సర్కార్ - టిఆర్ ఎస్ నేతల హస్తం కూడా ఉందని వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేయించిన రాజకీయ హత్య అని - రౌడీ డీఎస్పీ వల్లే నల్గొండలో హత్యలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కు నిజాయితీ ఉంటే ఈ హత్య కేసును సీబీఐకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే దీని వెనుక సీఎం హస్తం ఉన్నట్టుగానే భావిస్తామన్నారు. హైద్రాబాద్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని సర్వేలు చెబుతుండడంతో టీఆర్ ఎస్ కు భయం పట్టుకుందని - ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందన్నారు. ఈ కేసులో కొందరు టీఆర్ ఎస్ నేతల హస్తముందని - కావాలనే పోలీసులు కట్టుకథలు అల్లి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్ దోపిడీలకు పోలీసులు అండగా ఉన్నారని ఆరోపించారు. శ్రీనివాస్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని - లేకుంటే ఈ కేసు వెనుక సీఎం హస్తం ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ తో పాటు తన ప్రాణాలకూ ముప్పుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణ కోసం రక్తం చిందించి పోరాడిన వారిపై కేసీఆర్ కక్ష సాధిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే చావు తప్పదన్న సంకేతాలు వస్తున్నట్లుందన్నారు.