Begin typing your search above and press return to search.

తమ్ముడు రాజగోపాల్ కోసం రేవంత్ తో ఫైటింగ్ కు దిగిన అన్న వెంకటరెడ్డి

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:13 PM GMT
తమ్ముడు రాజగోపాల్ కోసం రేవంత్ తో ఫైటింగ్ కు దిగిన అన్న వెంకటరెడ్డి
X
వాళ్లద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నాదమ్ములు.. అన్నా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎదిగాడు. అన్నను చూసి తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చే అదేపార్టీ చెట్టు నీడలో ఎదిగాడు.. బలపడ్డాడు. కానీ ఇప్పుడు తమ్ముడు దారితప్పి పక్కపార్టీలోకి వెళ్లాడు. ఆపాల్సిన అన్న చోద్యంచూస్తున్నాడు. కాంగ్రెస్ లో తనకు దక్కని ప్రాధాన్యతను చూసి తమ్ముడిని ఎగదోశాడో ఏమో కానీ ఇప్పుడు తమ్ముడి చర్యకు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ అన్నాదమ్ములు ఎవరో కాదు.. కోమటిరెడ్డి బ్రదర్స్.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెరతీశారు. ఆయన బీజేపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అన్న, కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డిపై ఇప్పుడు అందరి వేళ్లు చూపుతున్నాయి. తమ్ముడు బీజేపీలోకి వెళ్లినా ఆపలేదనే అపవాదు కొనితెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే మునుగోడులో కాంగ్రెస్ నేతలంతా కలిసి ఐక్యంగా టీఆర్ఎస్, బీజేపీ పై పోరాటం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక కాంగ్రెస్ బ్రాండ్ లేకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెనుదమారం రేపాయి.

తమ బ్రదర్స్ ఇద్దరినీ కలిపి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించాలని అనుకుంటే ఆయన పేరు తీసుకొని మాట్లాడాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కోసం తాను 35 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నిజాయితీతో ఉన్న వాళ్లమే అని అన్నారు. రేవంత్ రెడ్డి అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు.

తన తమ్ముడు పార్టీకి, పదవికి రాజీనామా చేసి వెళ్లాడని.. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడా? అని సొంత పార్టీ చీఫ్ నే ప్రశ్నించాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన మీద మాట పడితే పడనని అన్నారు. తన తమ్ముడి వ్యవహారంలో తాను స్పందించబోనని స్పష్టం చేశారు. తాము సొంతంగా కాంట్రాక్టులు చేసుకొని పైకి వచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కించపరిచేలా ఉన్నాయని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడం వెనుక వెంకటరెడ్డి ఉన్నాడని కాంగ్రెస్ లోని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలు అనడంతో కాంగ్రెస్ లో అసమ్మతి చెలరేగింది.