Begin typing your search above and press return to search.

కేసీఆర్ మేన‌ల్లుడిపై వేటేసిన కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   13 Jun 2018 12:41 PM GMT
కేసీఆర్ మేన‌ల్లుడిపై వేటేసిన కాంగ్రెస్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ ఎలా షాక్ ఇచ్చింద‌నే విష‌యం ఆలోచిస్తున్నారా? కొద్దికాలం క్రితం జ‌రిగిన ప‌ర్వానికి ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ శుభం కార్డు వేసింది. తెలంగాణ పీసీసీ ఇద్దరు అధికార ప్రతినిధులను తొలగించింది. సిరిసిల్లకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి ఉమేష్ రావును - పార్టీ అధికార ప్రతినిధి - మీడియా కమిటీ కన్వీనర్ కొనగాల మహేష్‌ ను సస్పెండ్ చేస్తూ టీపీసీసీ ఉపాధ్యక్షులు - మీడియా కమిటీ బాధ్యులు మల్లు రవి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమేష్ రావు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యాన మేన‌ల్లుడు కావ‌డం విశేషం.

పార్టీ మీడియా క‌మిటీ క‌న్వీన‌ర్‌, అధికార ప్ర‌తినిధి విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొన‌గాల గ్రూప్ రాజ‌కీయాల‌ను చేస్తున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. బీజేపీకి చెందిన ఆది శ్రీ‌నివాస్‌ హ‌స్తం కండువా క‌ప్పుకోవ‌డం కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన వేములవాడ‌లో విబేధాలు పొడ‌చూపేందుకు కార‌ణంగా మారింది. ఆది చేరిక‌తో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఆది చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్న ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేష్‌ - టీపీసీసీ సభ్యుడు ఏనుగు మనోహర్‌ రెడ్డి ప్రత్యేకంగా గ్రూపుకట్టారు. ఆది శ్రీను చేరిక కార్యక్రమాన్ని బహిష్కరించారు. తమ అనుయాయులతో కోరుట్లలో క్యాంపు రాజకీయం మొదలెట్టారు. వేములవాడ కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి అధ్యక్షతన బుధవారం జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ - కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో సుమారు 1500మంది అనుచరులతో గ‌త బుధవారం `మళ్లీ` కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తమకు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కొనగాల మహేష్‌ - మనోహర్‌ రెడ్డిలతో పాటు నియోజకవర్గ మండలాల అధ్యక్షులు - సీనియర్‌ నాయకులు - కార్యకర్తలు కార్యక్రమాన్ని బహిష్కరించారు. పొన్నం తీరును నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. వేములవాడలో ర్యాలీ చేపట్టారు దీంతో కాంగ్రెస్ ఆయ‌న‌పై వేటు వేసింది.

ఇక ఉమేష్ రావు దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న స‌మ‌యంలో ఉమేష్‌ గులాబీ గూటికి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేరారు. స్వ‌యంగా కేసీఆర్ మేన‌ల్లుడే పార్టీ వీడ‌టం ఎదురుదెబ్బ‌గా ప‌లువురు భావించారు. కాగా, కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఉమేష్ రావు ఆయ‌న‌కు చేరువ అయ్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా ఉన్న ఉమేష్ ఆ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నార‌ని చ‌ర్చ జ‌రిగింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన కాంగ్రెస్ ఆయ‌న‌పై తాజాగా స‌స్పెన్ష‌న్ విధించింది.