Begin typing your search above and press return to search.

శుభ‌వార్త : కోన‌సీమ రైతుకు డ‌బ్బులొచ్చాయ్ !

By:  Tupaki Desk   |   9 Jun 2022 5:30 AM GMT
శుభ‌వార్త : కోన‌సీమ రైతుకు డ‌బ్బులొచ్చాయ్ !
X
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్ప‌టిదాకా రాని డ‌బ్బులు ఒక ప్ర‌ధాన మీడియా క‌థ‌నంతో వ‌చ్చాయి. కోన‌సీమ రైతులు పంట విరామం ప్ర‌క‌టిస్తున్న స‌మ‌యంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్పందించి, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన‌ డబ్బులివ్వ‌డంతో ఆ ప్రాంత రైతుల్లో ఆనందోత్సాహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కోన‌సీమలోని 13 మండ‌లాల్లో 198 రైతు భ‌రోసా కేంద్రాల నుంచి సేక‌రించిన ధాన్యానికి సంబంధించి ఐదు వేల ఐదు వందల మందికి 120 కోట్ల రూపాయ‌లను చెల్లించి ప్ర‌భుత్వం వారి వెత‌ల‌ను తీర్చింది. ఇందుకు క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా చూపించిన చొర‌వ ఫ‌లించింది. దీంతో కోన‌సీమ‌లో ఈ నెల వ‌ర‌కూ సేక‌రించిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి బ‌కాయిల‌న్నింటినీ ప్ర‌భుత్వం తీర్చేసింది. ఇక‌ముందు కూడా ఇదే విధంగా చెల్లిస్తామ‌ని అధికారులు భ‌రోసా ఇచ్చార‌ని తెలుస్తోంది.

మరోవైపు రైతుల మొర విని క‌లెక్ట‌ర్ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించారు. పంట విరామం పై కూడా వారు చెప్పిన మాట‌లు క‌దిలించాయి. యంత్రాంగంలో క‌ద‌లిక తెచ్చాయి. కోన‌సీమ పంట కాలువల‌ను, వివిధ డ్రెయిన్ల‌ను ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌తో మాట్లాడారు. అల్ల‌వ‌రం, ముమ్మిడివ‌రం, కాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం, ఐ.పోల‌వ‌రం మండ‌లాల్లో ప‌ర్య‌టించారు.

మురుగు కాలువ‌ల‌ను, ప్ర‌ధాన డ్రెయిన్ల‌ను, పంట కాలువ‌ల‌ను పరిశీలించి, అధికారుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. ముంపు నీరు చేరే సముద్ర ప్రాంతాన్నీ ప‌రిశీలించారు. సాగునీటి వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ఉండే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

2011 నాటి పంట విరామం రోజులు మ‌ళ్లీ వ‌స్తాయ‌ని కోన‌సీమ వ్యాప్తంగా వార్త‌లు వ‌స్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం వెనువెంట‌నే స్పందించి త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డంతో ఈ ప్రాంత రైతులు ఊర‌ట చెందారు. ఇదే విధంగా రైతాంగం ఎదుర్కొంటున్న ప్ర‌తి స‌మ‌స్య‌నూ ఇంతే వేగంతో ప‌రిష్క‌రించాల‌ని వేడుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. పంట విరామం ఆలోచ‌న‌ను విరమించుకోవాలి కోరారు. సాగుకు అవ‌స‌రం అయిన వ‌స‌తులు అన్నీ క‌ల్పిస్తామ‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని క‌లెక్ట‌ర్ భ‌రోసా ఇచ్చారు. మ‌రో వారంలో మురుగు కాలువ‌లకు పూడిక తీత తీయిస్తామ‌ని, పంట కాలువ‌ల‌కు సాగు నీరు విడుద‌ల చేసినందున పంట విరామం చేయాల‌న్న ఆలోచ‌న‌ను విర‌మించుకుని, ఖ‌రీఫ్ ప‌నులు వెంట‌నే చేప‌ట్టాల‌ని కోరారు.