Begin typing your search above and press return to search.

కోనసీమ అల్లర్లలో మరో 6గురు అరెస్టు.. పోలీసుల అదుపులో మొత్తం 135 మంది..!

By:  Tupaki Desk   |   8 Jun 2022 4:02 AM GMT
కోనసీమ అల్లర్లలో మరో 6గురు అరెస్టు.. పోలీసుల అదుపులో మొత్తం 135 మంది..!
X
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసంకు సంబంధించి పోలీసుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు వంద మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం అల్లర్లకు సంబంధించి మరో ఆరుగురు నిందితులను తాజాగా అరెస్టు చేశారు.

అమలాపురం అల్లర్ల కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులను రూపొందించి, హింసాత్మక చర్యలను సూచిస్తూ వీరు మెసెజ్‌లు పెట్టినట్టు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. పోలీసులు తాజాగా అరెస్టు చేసినవారిలో అయినవిల్లికి చెందిన ఆకుల శంకర్‌గణేష్, తోటకూర సాయిప్రసాద్, ఆకుల సతీష్, కామిశెట్టి పట్టాభిరామయ్య, సఖినేటిపల్లికి చెందిన మేడిచర్ల సతీష్‌, అమలాపురం పట్టణం శ్రీరామ్‌పురానికి చెందిన దాసరి కుమారస్వామి ఉన్నారు. అల్లర్లు, విధ్వంసాల్లో వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అమలాపురం విధ్వంసానికి సంబంధించి ఇప్పటి వరకూ 135 మందిని జైలుకు పంపినట్టు తెలిపారు.

కాగా, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో ఇప్పటివరకూ ఈ అల్లర్లపై ఏడు ఎఫ్‌ఆర్‌ఐలు నమోదు చేశారు. మొత్తం ఏడు ప్రత్యేక పోలీస్‌ బృందాలతో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజీలు, వీడియో సాక్ష్యాలు, ఇతర శాస్త్రీయ పద్ధతుల్లో నిందితులను గుర్తిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, మరికొంత మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని పేర్కొంటున్నారు. కాగా కోనసీమలో ఇంకా 144 సెక‌్షన్, పోలీస్‌ సెక‌్షన్‌ 30 అమల్లోనే ఉన్నాయి.

మరోవైపు ప్రభుత్వ ఆస్తులతోపాటు రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించింది.. టీడీపీ నేత మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అనుచరుడు గంధం పల్లంరాజేనని పోలీసులు తేల్చారు.

ఈ నేపథ్యంలో అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్‌, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు.. గంప అనిల్‌, యాళ్ల నాగులతోపాటు 18 మందిని జూన్ 6న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఫేసుబుక్, వాట్సాప్ తదితర సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పిన వారు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

కాగా అమలాపురం అల్లర్లు, విధ్వంసం అంతా వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే సాగించారని పోలీసులు చెబుతున్నారు. అల్లర్లు, విధ్వంసం కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి మరీ విద్వేషాలు రెచ్చగొట్టారని అంటున్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు అల్లర్లకు పాల్పడేవారికి సమాచారం అందించారని చెబుతున్నారు.

ఏ సమయంలో దాడులకు పాల్పడాలో కూడా స్కెచ్ గీశారని, పక్కా ప్రణాళిక ప్రకారం కుట్రను అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ఈ మేరకు వాట్సాప్‌ సందేశాలు, కాల్‌ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించి పోలీసులను పూర్తి ఆధారాలను సేకరించారని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో కుట్రదారులు, పాత్రధారులు మరికొందరి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తారని చర్చ జరుగుతోంది.