Begin typing your search above and press return to search.

రేవంత్ వైట్ చాలెంజ్ కు ఓకే చెప్పిన కొండా.. ఫైర్ బ్రాండ్ రియాక్షన్ ఇదే

By:  Tupaki Desk   |   19 Sep 2021 4:16 AM GMT
రేవంత్ వైట్ చాలెంజ్ కు ఓకే చెప్పిన కొండా.. ఫైర్ బ్రాండ్ రియాక్షన్ ఇదే
X
సంబంధం లేని విషయాల్లోకి కొన్నిసార్లు తలదూర్చాల్సి వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మంత్రి కేటీఆర్ దమ్ముంటే డ్రగ్స్ పరీక్ష చేయించాలని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించటం తెలిసిందే. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. తాజాగా నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని.. డ్రగ్స్ తో నాకేంటి సంబంధమన్న ఆయన.. మీ రాహుల్ ను కూడా పరీక్షకు తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. పిచ్చి మాటలు మాట్లాడితే గుడ్డలూడదీస్తం.. రాజ ద్రోహం కేసులు పెట్టేందుకు వెనుకాడమన్నారు. టికెట్లు అమ్ముకోవటానికే రేవంత్ హడావుడి చేస్తున్నారన్న కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలకు టీ పీసీసీ చీఫ్ స్పందించారు.

తాను మంత్రి కేటీఆర్ ను డ్రగ్స్ నమూనాలు ఇవ్వాలని కోరలేదన్నారు. గ్రీన్ చాలెంజ్ తరహాలో తాను వైట్ చాలెంజ్ విసురుతున్నానని.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తాను అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని.. మంత్రి కేటీఆర్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలు వస్తే.. ఉస్మానియాకు వెళ్లి ముగ్గురం.. రక్తం.. వెంట్రుకలు పరీక్షకు ఇద్దమంటూ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేత ఒకరు మంత్రి కేటీఆర్ పేరు తీసుకొస్తే.. అందుకు బదులుగా రాహుల్ పేరును లాగిన మంత్రికి.. పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నరేవంత్ బదులిస్తూ.. వైట్ చాలెంజ్ కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. ఈ వైట్ చాలెంజ్ ను తాజాగా కొండా విశ్వేశ్వరరెడ్డి స్వీకరించారు. తాను డ్రగ్స్ కు వ్యతిరేకమని.. తాను ఏ సవాలుకైనా రెఢీ అన్న ఆయన.. తన పేరును ఎందుకు లాగారో తెలీదన్న ఆయన.. తాను దేనికైనా రెఢీ అన్నారు. తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఏ సవాలుకైనా తాను సిద్ధమేనన్నారు. దీనికి సంబందించిన ట్వీట్ ను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కొండా ట్వీట్ కు రేవంత్ రెడ్డి రియాక్టు అయ్యారు. తాను విసిరిన వైట్ చాలెంజ్ ను స్వీకరించిన కొండా విశ్వేశ్వరరెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. సోమవారం ఉదయం 12 గంటలకు హైదరాబాద్ లోని అమరవీరుల స్తూపం వద్ద కలుద్దామని.. డ్రగ్స్ టెస్టుకు నమూనాలు ఇద్దమన్నారు. రేవంత్ విసిరిన సవాలుకు కొండా స్పందించారు సరే.. మరి మంత్రి కేటీఆర్ మాటేంటి? ఇప్పటికే ఏ పరీక్షకైనా సిద్ధమే అన్న ఆయన.. రేవంత్ విసిరిన సవాలుకు ఏమని బదులిస్తారో చూడాలి.