Begin typing your search above and press return to search.

కొండా-దానం-బొడిగెలకు టిక్కెట్లు దక్కుతాయా లేదా?

By:  Tupaki Desk   |   6 Sep 2018 1:30 PM GMT
కొండా-దానం-బొడిగెలకు టిక్కెట్లు దక్కుతాయా లేదా?
X
అసెంబ్లీని రద్దు చేసిన అర్ధగంటలోనే ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ దాదాపుగా అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లిచ్చారు. ఇద్దరి స్థానంలో కొత్తగా ఇతరులకు ఇవ్వగా మరికొందరివి పెండింగులో పెట్టారు. ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ స్థానంలో జర్నలిస్ట్ క్రాంతికి టిక్కెట్ ఇవ్వగా చెన్నూరులో నల్లాల ఓదెలుకు బదులు ఎంపీ బాల్క సుమన్‌ కు టిక్కెట్ దక్కింది.

ఇక వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు టిక్కెట్ పెండింగ్ లో పెట్టారు. కొండా సురేఖ పార్టీ మారతారన్న ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఆమెకు సీటు ఖరారు చేయలేదని తెలిసింది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ లో చేరితే ఆమె స్థానంలో మేయర్ నన్నపనేని నరేందర్ పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ కు కూడా టికెట్ ఖరారు చేయలేదు. దానం నాగేందర్ ఖైరతాబాద్ లో పోటీ చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఆయనకు సీటు ఇవ్వలేదు. దానం ను ఒక దశలో గోషామహల్ లో పోటీ చేయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోషా మహల్ స్థానాన్ని ప్రకటించలేదు.

కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ టికెట్ కూడా పెండింగులో పెట్టారు. అక్కడి ఎమ్మెల్యే బొడిగె శోభ వివాదాల్లో ఉండడంతో ఆమెకు టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. బొడిగె శోభ మీద నిన్న కూడా కొందరు ఎంపిపిలు - జెడ్పీటిసిలు సిఎం కేసిఆర్ కు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యేగా సంజీవరావుకూ ఇంకా టికెట్ ఖరారు కాలేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభ్యర్థి ప్రకటన పెండింగ్ లో ఉంచారు కేసిఆర్. అక్కడ గత ఎన్నికల్లో తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను గత ఎన్నికల్లో పోటీకి పెట్టారు. ఈసారి ఎవరికిస్తారో తెలియాల్సి ఉంది. కోదాడ సీటును ఇంకా కేసిఆర్ ప్రకటించలేదు. ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గతంలో కోదాడ నుంచి వేనేపల్లి చందర్ రావు పోటీ చేసి పద్మావతి రెడ్డి మీద ఓడిపోయారు. ఇక్కడ కొత్త అభ్యర్థి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.