Begin typing your search above and press return to search.

కొండా దంప‌తుల కోసం కేసీఆర్ మెట్టు దిగారు

By:  Tupaki Desk   |   17 Sep 2018 3:18 PM GMT
కొండా దంప‌తుల కోసం కేసీఆర్ మెట్టు దిగారు
X
రాష్ట్ర వ్యాప్తంగా 105మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను ఖరారు చేసిన టీఆర్ ఎస్ అధిష్టానం పలువురికి బెర్త్ ఖరారు చేయక పెండింగ్‌ లో పెట్ట‌డం...అందులో వరంగల్ తూర్పు నియోజకవర్గం త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఫైర్‌ బ్రాండ్ ఎమ్మెల్యే కొండా సురేఖ సైతం ఉండ‌టం...టికెట్ ప్రకటించకపోవడంతో కొండా దంపతులు పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి.... త‌మ అభ్య‌ర్థిత్వం పెండింగ్ పెట్టడానికి గల కారణాలు తెలియచేయాలని...లేని పక్షంలో బహిరంగ లేఖ రాస్తామని హెచ్చరించ‌డం తెలిసిన సంగ‌తే. వీరి విష‌యంలో టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే కొండా దంప‌తుల కోసం కేసీఆర్ మెట్టుదిగిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆమె సైతం త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ఉందంటున్నారు.

వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖ - పరకాల నుండి తన కూతురు సుస్మితకు టికెట్లు కేటాయించాలని పార్టీకి ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో సురేఖ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారంతో ఆమె సీటు పెండింగ్‌ లో పెట్ట‌డానికి కార‌ణ‌మ‌ని చ‌ర్చ జరిగింది. అయితే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అనంత‌రం కార‌ణాలు ఏవైనా టీఆర్ ఎస్ అధిష్టానం దుమ్మెత్తిపోసిన కొండా దంపతులు వేరే పార్టీలోకి జంప్ అవుతారన్న ప్రచారం జ‌రిగింది. అయితే ఈ స‌మ‌యంలోనే కేసీఆర్ ఎంట్రీ ఇచ్చి ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్నారు. . కీల‌క‌మైన వ‌రంగ‌ల్ జిల్లాలో సీట్లను కోల్పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. కొండా దంపతులు వరంగల్‌ తూర్పు - పశ్చిమ - పరకాల - భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రత్యక్షంగా - మరో మూడు నియోజకవర్గాలను పరోక్షంగా ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్సీ వర్గాలు గులాబీ దళపతికి నివేదికలు అందించినట్లు సమాచారం. దీనితో ఓ కీలక నేత రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా దంప‌తుల విష‌యంలో కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని - తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టపోతారని నచ్చచెప్పినట్లు సమాచారం.

మ‌రోవైపు కేసీఆర్ సైతం కొండా ముర‌ళితో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంతో పాటు మరో నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని - ఒకవేళ రెండో టికెట్‌ ఇవ్వలేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్‌ ను తనకు వదిలేసి జిల్లాలో పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా దంప‌తులు పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. గణపతి నవరాత్రులను కొండా దంపతులు తమకు కీడుదినాలుగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు వాళ్లు గడపదాటి బయటికి రారు. ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరు. ఈ నేపథ్యంలో నవరాత్రులు ముగిసిన అనంతరం వాళ్లు నేరుగా కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు స‌మాచారం.కాగా, టీఆర్ ఎస్‌ అధికారంలోకి రావాలంటే ఉమ్మడి వరంగల్‌ జిల్లా అత్యంత కీలకమని పార్టీ అధిష్టానం భావిస్తోందని అందుకే కేసీఆర్ దిగివ‌చ్చార‌ని అంటున్నారు.