Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కు కొండా రాజీనామా

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:04 AM GMT
టీఆర్ ఎస్‌ కు కొండా రాజీనామా
X
ఊహించిందే జ‌రిగింది. టికెట్ల కేటాయింపులో త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ అల‌క‌బూనిన కొండా దంప‌తులు ఎట్ట‌కేల‌కు టీఆర్ ఎస్‌ కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్టీలో త‌మ‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని.. నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా సీఎం కేసీఆర్ త‌మ‌కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని కొండా సురేఖ ఆరోపించారు. టీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీగా మారిపోయిందంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌ లో ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆమె పార్టీకి త‌మ రాజీనామా విషయాన్ని ప్ర‌క‌టించారు.

కేటీఆర్‌ ను సీఎం చేయాలని అనుకుంటున్న కేసీఆర్.. ఆ ప్ర‌య‌త్నాల్లో భాగంగా సీనియర్ నాయకులను అణచి వేస్తున్నారని సురేఖ‌ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను కూడా ఆమె విడుదల చేశారు. అమరవీరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డంపైనా అందులో ప్ర‌శ్న‌లు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్ పాతరేశారని విమ‌ర్శించారు. కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదేనంటూ ఎద్దేవా చేశారు. బీసీ మహిళగా తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా, కేసీఆర్ తన దొరతనాన్ని చూపించారని ఆరోపించారు. వరంగల్ వచ్చి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేసినప్పుడు కూడా తనను కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపలేదని తెలిపారు. కేసీఆర్‌ ను - టీఆర్ ఎస్‌ ను నమ్మే పరిస్థితి లేదని.. అందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు.