Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో చేరిన కొండా దంపతులు!

By:  Tupaki Desk   |   26 Sep 2018 7:43 AM GMT
కాంగ్రెస్‌ లో చేరిన కొండా దంపతులు!
X
ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌కు టికెట్ ద‌క్క‌లేదంటూ టీఆర్ ఎస్‌ అసమ్మతి నేతలు కొండా సురేఖ - మురళీ దంపతులు ....కేసీఆర్ అండ్ కో పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే వారు పార్టీ మార‌బోతున్నారంటూ ఊహాగానాలు రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా నేడు కొండా దంప‌తులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా దంపతులు బుధ‌వారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన వారిద్ద‌రూ....బుధ‌వారం ఉద‌యం రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్ తో భేటీ అయిన కొండా దంపతులు.....ఆ త‌ర్వాత పార్టీలో చేరారని తెలుస్తోంది. తూర్పు వ‌రంగ‌ల్ - ప‌ర‌కాల సీట్ల‌ను త‌మ‌కు కేటాయించాల‌ని స్ప‌ష్ట‌మైన హామీ తీసుకున్న త‌ర్వాతే వారు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఆపద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .....105 మంది అభ్యర్ధులు జాబితాను ప్ర‌క‌టించిన త‌ర్వాత టికెట్ ద‌క్క‌ని కొండా దంప‌తులు తీవ్ర అసంతృప్తికి గురైన సంగ‌తి తెలిసిందే. వరంగల్ జిల్లాపై మంచి ప‌ట్టున్న ఈ ఇద్ద‌రికి టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో ...కొండా దంప‌తుల‌తో పాటు ప‌లు పార్టీల నాయ‌కులు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. త‌మ‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అడిగేందుకు ముఖ్యమంత్రిని కూడా క‌లిసే అవ‌కాశం వారికి ద‌క్క‌లేదు. ఆ దంప‌తుల‌కు కేసీఆర్....అపాయింట్ మెంట్ కూడా ఇవ్వక‌పోవ‌డంతో వారు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ సొంత‌గూడు వంటి కాంగ్రెస్ లో చేరారు. కొండా దంపతులు కాంగ్రెస్‌ లోకి వెళ్లడం ఇపుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండమంటూ కేటీఆర్‌ కు కొండా దంపతులు సవాల్‌ విసిరిన సంగ‌తి తెలిసిందే. కొండా దంప‌తుల చేరిక‌తో కాంగ్రెస్ కు అద‌న‌పు బ‌లం చేకూరింద‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.