Begin typing your search above and press return to search.

ప‌ర‌కాల‌కు కొండా దూర‌మైన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   27 Sep 2018 9:39 AM GMT
ప‌ర‌కాల‌కు కొండా దూర‌మైన‌ట్లేనా?
X
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంచి ప‌ట్టున్న కొండా దంప‌తులు తిరిగి కాంగ్రెస్‌ లో చేర‌డంతో అక్క‌డి రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. జిల్లాలో ఏ నియోజ‌క‌వర్గం నుంచి ఎవ‌రు బ‌రిలో దిగుతార‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కొండా దంప‌తులు కోరుతున్న‌ట్లు కాంగ్రెస్ అధిష్ఠానం వారికి రెండు సీట్లు కేటాయిస్తుందా? లేక ఒక్క సీటుతోనే స‌రిపెడుతుందా? సురేఖ ఎక్క‌ణ్నుంచి పోటీ చేస్తారు? మ‌హాకూట‌మి పొత్తుల నేప‌థ్యంలో ఎవ‌రు త‌మ స్థానాల‌ను త్యాగం చేయాల్సి వ‌స్తుంది? వ‌ంటి ప‌లు ప్ర‌శ్న‌లు జ‌నాల మెద‌ళ్ల‌ను తొలిచేస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో కొండా సురేఖ వ‌రంగ‌ల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఈ ద‌ఫా కూడా ఆమె అక్క‌ణ్నుంచే పోటీ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. అయితే, తూర్పుతో పాటు ప‌ర‌కాల సీటును కూడా త‌మ‌కే కేటాయించాల‌ని కొండా దంప‌తులు అధిష్ఠానాన్ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది. రెండు సీట్లు వ‌స్తే.. ఒకచోట తాను - మ‌రోచోట త‌న భ‌ర్త ముర‌ళి బ‌రిలోకి దిగొచ్చ‌న్న‌ది సురేఖ ఆలోచ‌న‌. ముర‌ళి కాక‌పోయినా.. కుమార్తె సుస్మిత‌తోనైనా ఈసారి అసెంబ్లీకి పోటీ చేయించాల‌నేది ఆమె ప్ర‌ణాళిక‌గా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారు ప‌ర‌కాల టికెట్ కోరుతున్నారు. గ‌తంలో తాను అక్క‌ణ్నుంచే విజ‌యం సాధించాన‌ని.. ఆ టికెట్ ఇస్తే క‌చ్చితంగా విజ‌యం సాధిస్తామ‌ని సురేఖ విశ్లేషిస్తున్నారు. అయితే, ఇక్క‌డో చిక్కు స‌మ‌స్య ఉంది. కొండా దంప‌తులు టీఆర్ ఎస్‌ లోకి వెళ్లాక‌.. ఇనుగాల వెంక‌ట్రామిరెడ్డి ప‌ర‌కాల‌లో కాంగ్రెస్‌ కు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. తాను నాలుగున్న‌రేళ్లుగా పార్టీ శ్రేణుల‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నాన‌ని.. ఇప్పుడు త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుంటే అన్యాయం చేసిన‌ట్లేన‌ని ఇన‌గాల వాదిస్తున్నారు.

మ‌హాకూట‌మి నేప‌థ్యంలో సీట్ల పంప‌కం కూడా ఇక్క‌డ త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశ‌ముంది. ప్ర‌స్తుతం న‌ర్సంపేట‌లో కాంగ్రెస్‌ కు సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి ఉన్నారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన దొంతి.. ఆ త‌ర్వాత తిరిగి సొంత‌గూడు కాంగ్రెస్‌ లోనే చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న్ను న‌ర్సంపేట నుంచి క‌దిలించే అవ‌కాశాల్లేవు. అప్పుడు న‌ర్సంపేట‌లో టీడీపీ సీనియ‌ర్ నేత రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంది. కాబ‌ట్టి మ‌హాకూట‌మి సీట్ల పంప‌కంలో భాగంగా రేవూరిని ప‌ర‌కాలకు పంపించి.. దొంతిని న‌ర్సంపేట‌లోనే ఉంచాల‌ని కాంగ్రెస్‌ వ‌ర్గాలు యోచిస్తున్నాయి. కాబ‌ట్టి ఏ కోణంలో చూసినా.. కొండా దంప‌తులకు ప‌ర‌కాల సీటు ద‌క్కే అవ‌కాశం లేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
-