Begin typing your search above and press return to search.

లోక్‌ సభకు కేసీఆర్?

By:  Tupaki Desk   |   12 Sep 2018 5:28 PM GMT
లోక్‌ సభకు కేసీఆర్?
X
అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ మళ్లీ లోక్ సభ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారా? రాష్ట్రాన్ని కుమారుడు కేటీఆర్‌ కు అప్పగించి దిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నారా? అంటే అవుననే అంటున్నారు టీఆరెస్ అసంతృప్త నేత కొండా సురేఖ. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ ను సీఎం చేసేందుకే కేసీఆర్ తనలాంటి వారికి టిక్కెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. టీఆరెస్ ఆరోపిస్తున్నట్లుగా తామేమీ మూణ్నాలుగు టిక్కెట్లు అడగలేదని.. అవకాశం ఉంటే తన భర్త కానీ - కూతురు కానీ పోటీ చేస్తారని అనుకున్నామని - కానీ - పార్టీ ముందు ఆ డిమాండ్ పెట్టలేదని చెప్పారు. తమను కావాలనే పక్కనపెట్టారని ఆమె ఆరోపించారు.

మంత్రి - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ పదవుల హామీతోనే తనను పార్టీలోకి తీసుకున్నారని చెప్పారు. తాను అహంకారిని అయితే తన నియోజకవర్గం ప్రజలు తనను నాలుగుసార్లు ఎలా గెలిపిస్తారని ఆమె ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది తెరాస కాదని విమర్శించారు. తెరాస రాజకీయ అవసరాల కోసం తనను బరిలోకి దింపారని చెప్పారు. తెరాస అధినేత కేసీఆర్‌ది నియంతృత్వ పోకడ అన్నారు. మంత్రులు కూడా నోరు విప్పే పరిస్థితి లేదని చెప్పారు. కేసీఆర్ చుట్టూ కోటరీ ఉందని కొండా సురేఖ అన్నారు. ఈ ఎన్నికలలో గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని - ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ లోకసభకు వెళ్తారని ఆసక్తికర - సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసకు వచ్చే ఎన్నికల్లో యాభై - అరవైకు మించి సీట్లు రావని జోస్యం చెప్పారు. తమకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని వినాయక చవితి తర్వాత చెబుతామని అన్నారు.

టీఆర్ ఎస్ పార్టీలో ఓ వర్గం తమను టార్గెట్ చేస్తోందని కొండా సురేఖ ఆరోపించారు. తాము ఏ పార్టీలోకి వెళ్లేది త్వరలో ప్రకటన చేస్తామని తేల్చి చెప్పారు. కొడుకును ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ ప్లాన్ అని ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా కేటీఆర్‌ తోనే విభేదాలు వచ్చాయని - తాను ప్రశ్నించానని కొండా సురేఖ చెప్పారు. అదే వారిని ఇబ్బంది పెట్టి ఉంటుందని అన్నారు.