Begin typing your search above and press return to search.

పీసీసీని ఇబ్బందుల్లో పడేసిన కొండా

By:  Tupaki Desk   |   6 Sep 2021 5:30 PM GMT
పీసీసీని ఇబ్బందుల్లో పడేసిన కొండా
X
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ పీసీసీ నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడి ప్రకటన కన్నా ముందే సీనియర్ నేతల్లో చాలామంది కొండా సురేఖ అయితే బాగుంటుందని తేల్చారు. దీనికి అనుగుణంగానే కొండా పేరును పీసీసీ సమన్వయ కమిటీ అధిష్టానికి సిఫారసు కూడా చేసిందని సమాచారం.

సరే తర్వాత పరిణామాల్లో ఆసక్తి ఉన్న నేతలను దరఖాస్తు చేసుకోమన్నారు. దరఖాస్తుల గడువు మొన్నటి ఆదివారంతో ముగిసిపోయింది. మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే 18. ఇందులో కొండా సురేఖ దరఖాస్తు లేదు. కొండా దరఖాస్తు చేయకపోతే వచ్చిన దరఖాస్తుల్లో కూడా 11 నియోజకవర్గానికి చెందిన నేతలవి కాగా మిగిలిన ఎనిమిది బయట నేతలవి. అయితే అందిన దరఖాస్తుల్లో ఒక్కటి కూడా ఉపఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేంత సీనున్న నేతలవి కాదని సమాచారం.

నిజానికి దరఖాస్తుల వ్యవహారం ఎందుకు పెట్టారంటే కొండా సురేఖ కూడా దరఖాస్తు చేస్తారని అనుకుని. కానీ ఆశ్చర్యంగా కొండా దరఖాస్తు చేయకపోగా పెద్దగా పోటీ ఇవ్వలేని నేతలు 18 మంది దరఖాస్తు చేయడం తో ఏమి చేయాలో పీసీసీ నేతలకు అర్ధం కావటం లేదు. ఇపుడు పీసీసీ సమస్య ఏమిటంటే దరఖాస్తు చేసిన వాళ్ళల్లో 18 మందినీ కాదనలేరు. అలాగని వాళ్ళల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేయలేరు. ఎందుకంటే వీరిలో ఎవరు కూడా టీఆర్ఎస్, బీజేపీ తరపున పోటీచేయబోయే అభ్యర్థులకు ఏ విధంగాను సరిపోరట.

దరఖాస్తు చేసిన వాళ్ళని కాదని దరఖాస్తు విషయాన్ని ఏ విధంగాను పట్టించుకోని కొండాకు టికెట్ ఇస్తే అదో పెద్ద సమస్యగా మారిపోతోంది. తమ దగ్గర డబ్బులు గుంజేందుకే దరఖాస్తులు తీసుకున్నారని నేతలు ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఒక్కొక్కరు తలా రు. 5 వేలు కట్టి మరీ దరఖాస్తులు చేశారు కాబట్టి. ఇపుడీ సమస్యలో నుంచి ఎలా బయటపడాలో పీసీసీ నాయకత్వానికి అర్ధం కావటం లేదు. అందుకనే దరఖాస్తు గడువు తేదీని మళ్లీ పొడిగించే అవకాశం ఉందని సమాచారం.

దరఖాస్తు గడువును పొడిగిస్తే కొండాను బతిమలాడైనా దరఖాస్తు చేయించే ఆలోచనలో సీనియర్ నేతలున్నట్లు తెలుస్తోంది. అప్పుడు దరఖాస్తు చేసిన వాళ్ళనుండి కొండా సురేఖను ఎంపిక చేసినట్లు బిల్డప్ ఇవ్వాలని పీసీసీ నాయకత్వం ప్లాన్ వేస్తోంది. అయితే ఇదే సమయంలో దరఖాస్తు విషయంలోనే పీసీసీ నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిన కొండా సురేఖ రేపు అభ్యర్ధిగా ఖరారరైన తర్వాత ఇంకెంత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందో అనే నేతలు కూడా ఉన్నారు. మొత్తానికి దరఖాస్తుల యవ్వారం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.