Begin typing your search above and press return to search.

అమ్మా.... కొండా... మీరు కేక...

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:30 AM GMT
అమ్మా.... కొండా... మీరు కేక...
X
కొండా సురేఖ... కొండా మురళీ. ప్రస్తుతం తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఈ దంపతుల పేర్లు హాట్ హాట్‌గా వినిపిస్తున్నాయి. ముందస్తుకు వెళ్తున్నామని, వీరే మా 105 మంది అభ్యర్ధులు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. ఈ జాబితాలో కొండా సురేఖ దంపతుల పేర్లు మాత్రం లేవు. దీంతో వారిద్దరే కాదు... వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇతర పార్టీల నాయకులు కూడా ఆశ్యర్యపోయారు. తమకు టిక్కట్లు ఎందుకు ఇవ్వడం లేదు అని ముఖ్యమంత్రిని కలిసి అడుగుదామనుకున్న కొండా దంపతులకు కల్వకుంట్ల వారు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.దీంతో ఇక వేరే పార్టీలోకి మారాలని నిర్ణయించుకున్నారు కొండా దంపతులు. ఇంతకు ముందు వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో ఆ పార్టీలోకి మారే యోచన చేస్తున్నారు. ఈ విషయమై సంప్రదింపులు చేసేందుకు కొండా దంపతులు ఢిల్లీ చేరుకున్నారు. వరంగల్ జిల్లాలో తూర్పు నియోజకవర్గంతో పాటు పరకాల నుంచి కొండా దంపతులిద్దరికి కావాలని పట్టబడుతున్నారు. అయితే ఎంత వరకూ ఫలిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును - ఆయన కుమారుడు తారక రామారావును టార్గెట్ చేస్తూ కొండా దంపతులు బహిరంగ లేఖ రాయడంతో పాటు విలేకరుల సమావేశంలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇందులోనూ వారు తమ రాజకీయ మేథోతనాన్ని చూపించారు.

ఇంతకీ అదేమిటనుకుంటున్నారా. తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీష్ రావు వర్గం - తారక రామారావు వర్గంగా విడిపోయారని - పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల వారికి ఇది తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతున్న సందర్భం ఇది. ఈ నేపథ్యంలో కొండా దంపతులు ఓ బుల్లెట్ వంటి మాటను ప్రయోగించారు. తాము మంత్రి హరీష్ రావు వర్గమని - అందుకే తమను బయటకు పంపాలని కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో... ఎంత కట్టుకథ ఉందో కాని కొండా దంపతులు వదిలిన బుల్లెట్ మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత విభేధాలున్నాయని జరుగుతున్న ప్రచారానికి మంచి బలాన్ని ఇచ్చింది. మంత్రి హరీష్ రావు రెండు రోజుల క్రితం ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుండును అని సంచలన ప్రకటన చేసిన తర్వాత కొండా దంపతులు చేసిన ఈ సరికొత్త ప్రకటన రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. తెరాసలో వర్గాలు ఉన్న మాట నిజమేనా..... హరీష్ మనుషులకు టిక్కట్లు ఇవ్వకపోవడం, వారిని బయటకు పంపాలనుకోవడం వాస్తవమేనా అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొండా దంపతులు తాము హరీష్ రావు వర్గమంటూ చేసిన ప్రకటన మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితిని ఓ కుదుపు కుదపడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు.