Begin typing your search above and press return to search.

రేవంత్ ప్లాన్ ను పడనివ్వని కొండా సురేఖ

By:  Tupaki Desk   |   1 Oct 2021 8:34 AM GMT
రేవంత్ ప్లాన్ ను పడనివ్వని కొండా సురేఖ
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న రెండు ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అందరి చూపు హుజూరాబాద్ మీదనే ఉంది. కడప జిల్లా బద్వేల్ లో ఉప ఎన్నిక జరగనున్నా.. అక్కడ అధికార వైసీపీ గెలుపు ఖాయమన్న సంగతి తెలిసిందే. నిజానికి బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం కేవలం అధికారిక లెక్కలకు మాత్రమే తప్పించి మరింకేమీ కాదని చెబుతారు. అదే సమయంలో తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక అందుకు భిన్నంగా హోరాహోరీగా సాగనుంది.

ఏ పార్టీకి ఆ పార్టీకి తమ సత్తా చాటాలన్నదే ప్రయత్నంగా మారింది. ఏ పార్టీకి ఆ పార్టీకి కొన్ని తప్పనిసరిగా మారింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఈ గెలుపు చావురేవుగా మారింది. ఈ గెలుపుతో బీజేపీ తెలంగాణలో తనకు పెరిగిన బలాన్ని ప్రదర్శించాలని తపిస్తోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ కు ఈ గెలుపు అనివార్యంగా మారింది. పార్టీ మొత్తం కేసీఆర్ చుట్టూనే తిరగాలే కానీ.. మరెవరూ ముఖ్యం కాదన్నది మరోసారి నిరూపించాల్సిన బాధ్యత గులాబీ బాస్ మీద పడింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీది మరోచిత్రమైన పరిస్థితి. ఆ పార్టీ గెలవదన్న విషయం తెలిసినప్పటికీ.. కనీస పోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లకు కాస్తంత ఎక్కువ వస్తే చాలు.. తెలంగాణలో తమ బలాన్ని పెరిగినట్లుగా చూపాలన్న ఆలోచనతో వచ్చింది.

గత ఎన్నికల్లో సాధించిన ఓట్లకు ఏ మాత్రం తగ్గినా ఇబ్బందికర పరిస్థితి తప్పదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ కు ఇదో ఇబ్బందికర పరిణామంగా మారనుంది. ఇలా ఎవరికి వారు ప్లాన్లు వేస్తున్న వేళ.. టీఆర్ఎస్.. బీజేపీలకు అభ్యర్థులు తేలిపోగా.. కాంగ్రెస్ తరఫున ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది. దీంతో రేవంత్ ఆలోచనలు కొండా సురేఖ ను బరిలోకి దించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆమె బరిలోకి దిగితే బీసీ మహిళతో పాటు.. జనాకర్షణ శక్తి ఉన్న ఆమెతో గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను సింఫుల్ గా సొంతం చేసుకుంటామన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. సురేఖది పద్మశాలీ వర్గం కాగా.. కొండా మురళీది మున్నూరు కాపు వర్గీయుడు. వీరిద్దరి ప్రేమ వివాహం కావటంతో.. సురేఖ కానీ బరిలోకి దిగితే.. రెండు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అందుకే.. ఆమెను బరిలోకి దిగాలని రేవంత్ కోరినట్లు చెబుతున్నారు. అయితే.. ఉప ఎన్నికల్లో పోటీ చేసినా.. తర్వాత వరంగల్ కే తిరిగి వస్తానని.. ఆ హామీ ఇస్తేనే పోటీకి దిగుతానన్న కండీషన్ ను ఆమె పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. ఉప ఎన్నికల బరిలోకి దిగటానికి ఆమె సిద్ధంగా లేరంటున్నారు. ఇటీవల ఆమెను బరిలోకి దిగాలని రేవంత్ కోరగా.. అందుకు ఆమె సానుకూలంగా స్పందించలేదంటున్నారు. అదిప్పుడు ఆయనకు షాకింగ్ గా మారిందని చెబుతారు. మరి.. చివరికైనా సురేఖను రేవంత్ ఒప్పిస్తారా? మరొకరు అభ్యర్థిగా ఎంపిక చేయనున్నారా? అన్నది తేలాల్సి ఉంది.