Begin typing your search above and press return to search.

కేసీఆర్ వర్సెస్ 'కొండా'.. ఎవరి గాలి వీస్తుంది.?

By:  Tupaki Desk   |   28 Sept 2018 3:34 PM IST
కేసీఆర్ వర్సెస్ కొండా.. ఎవరి గాలి వీస్తుంది.?
X
ఆది నుంచి కారును ఆదరించిన జిల్లా అది.. అదే స్థాయిలో పార్టీలతో సంబంధం లేకుండా బలంగా నిలదొక్కుకున్నారు కొండా దంపతులు.. ఆమె ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూ వచ్చింది. నాడు కాంగ్రెస్ లో ఆ తర్వాత వైసీపీలో.. పోయిన సారి తెలంగాణ రాష్ట్ర సమితిలో విజయాలు వరించాయి. సొంత నియోజకవర్గం పరకాల నుంచి మారిన కొండా సురేఖ ఈజీగానే గెలిచేశారు. వరంగల్ రాజకీయాల్లో సురేఖ ఎంపీటీసీ నుంచి మంత్రి స్థాయి వరకూ ఎదిగిన బీసీ మహిళా నేత. శాయంపేట - పరకాల - వరంగల్ తూర్పు ఇలా ఎక్కడ పోటీ చేసినా గెలుపు వరించింది.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. వరంగల్ లో టీఆర్ ఎస్ బలంగా ఉంది. పోయిన సారి 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన కొండా సురేఖ కొత్త నియోజకవర్గమైనా ఈజీగానే గెలిచేశారు. ఈసారి టికెట్ రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. దీంతో సమీకరణాలు మారిపోయాయి. కొండా సురేఖ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మూడు నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించబోతున్నారు.

పరకాల - వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న ఆమె శాయంపేట - భూపాలపల్లిలో కూడా గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉన్నారు. కొండా దంపతులు బలమైన నేపథ్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ కనీసం రెండు నియోజకవర్గాల్లో పాగా వేస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గులాబీ దళం మాత్రం కేసీఆర్ పైనే నమ్మకంతో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోయిన సారి టీఆర్ ఎస్ చాలా నియోజకవర్గాలు గెలుచుకుంది. ఈసారి కేసీఆర్ పథకాలు హిట్ కావడంతో కొండా సురేఖ లాంటి బలమైన నేతలున్నా కానీ గులాబీ వికసిస్తుందని నమ్ముతున్నారు. మరి బలమైన కొండా దంపతులు వరంగల్ లో పట్టు నిలుపుకుంటారా.? కారు జోరు కొనసాగుతుందా అన్నది పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.