Begin typing your search above and press return to search.

విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. `విష‌యం` ఏంటి? ప్ర‌తిప‌క్ష‌మా? అధికార ప‌క్ష‌మా?

By:  Tupaki Desk   |   21 Sep 2021 1:30 PM GMT
విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. `విష‌యం` ఏంటి? ప్ర‌తిప‌క్ష‌మా? అధికార ప‌క్ష‌మా?
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్ట‌మే. అయితే.. ఎవ‌రూ కూడా రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్లు వేసి మాత్రం ప్ర‌యాణం చేయ‌రు. ఎందుకంటే.. ఎటూ కాకుండా పోతార‌ని తెలుసు క‌నుక‌.. అంటే. ఒక పార్టీలో ఉంటూ.. మ‌రో పార్టీని పొగ‌డ‌డం.. ఒక క్ష‌ణంఒక పార్టీని, మ‌రోక్షణంలో మ‌రోపార్టీని భుజాన మోసేయ‌రు. సో.. ఎటు ఉన్నా.. ఎలా ఉన్నా.. ఒక వైపు మాత్ర‌మే ఉంటారు. అయితే.. తెలంగాణ‌కు చెందిన కీల‌క నాయ‌కుడు.. కొంచెం మాట్లాడినా.. క‌త్తిలా స్పందిస్తార‌నే పేరున్న మాజీ ఎంపీ, సీనియ‌ర్ నాయ‌కుడు.. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ప‌రిస్థితి రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సీనియ‌ర్ నాయకులు ఏ పార్టీలో ఉన్నా.. అన్ని పార్టీల్లోని నాయ‌కుల‌కు వారు సుప‌రిచితులే. అయిన‌ప్ప‌టి కీ.. వారి పార్టీకి మాత్ర‌మే వారు బ్యాక్ బోన్‌గా ఉంటారు. అయితే.. కొండా ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌కు దాదాపు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు ఉన్నారు. దీంతో అంద‌రూ త‌న‌వారేన‌ని చెబుతారు. అయితే.. ఏ పార్టీతోనూ త‌న‌కు సంబంధం లేద‌ని వాదిస్తారు. కొంత కాలం రాజ‌కీయాల‌కు విరామం ప్ర‌క‌టిస్తారు. త‌ర్వాత అప్ప‌టికి ఏది హాట్ టాపిక్ అయితే.. దాన్ని తీసుకుని మీడియా ముందుకు వ‌స్తారు. అదేస‌మ‌యంలో తానే సొంత పార్టీ పెడ‌తాన‌ని అంద‌రూ వ‌చ్చి చేరాల‌ని చెబుతారు. అయితే.. ఇవి ఏవీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డం.

తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలుపొందారు కొండా విశ్వేశ్వర రెడ్డి. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా వేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వ‌చ్చిన పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక, మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్ర‌మంలో మరోసారి విశ్వేశ్వర్ రెడ్డి పేరు జోరుగా వినిపిస్తోంది. కొండా వ్య‌వ‌హారం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌గా మారింది.

ఒక‌సారి కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడ‌తారు. మ‌రోసారి బీజేపీకి అనుకూలంగా వ్యవ‌రిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కొంత కాలం వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. అయితే.. పార్టీ పుంజు కుంటున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా సొంత పార్టీపైనే కొండా దండెత్తారు. అధికార ప‌క్షం టీఆర్ఎస్‌పై స‌మ‌ర్థవంతంగా పోరాటం చేయ‌డంలో కాంగ్రెస్ విఫ‌ల‌మ‌వుతోంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. కాంగ్రెస్‌కు రిజైన్ చేశారు. ఆ త‌ర్వాత ఒక మూడు నెల‌లు రాజ‌కీయాల‌కు విరామం తీసుకుంటున్నట్లు విశ్వేశ్వర్‌రెడ్డి ప్రక‌టించారు. మ‌ధ్యలో ఒక‌సారి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్‌లో చేర‌తాన ని స్టేట్మెంట్ ఇచ్చాడు. మ‌రోవైపు తీన్మార్ మ‌ల్లన్నతో క‌లిసి ప‌నిచేస్తాన‌ని.. కొత్త పార్టీ పెడ‌తానంటూ ర‌క‌ర‌కాల ప్రక‌ట‌న‌లు ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ వ‌చ్చాక‌.. మ‌ర్యాద‌పూర్వకంగా రెండుసార్లు క‌లిశారు.. కానీ, పార్టీలో చేరేది లేనిది స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు బీజేపీ నేత‌ల‌తో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. ఇందిరాపార్క్ వ‌ద్ద మాజీ ఎంపీ వివేక్ నిర్వహించిన ధ‌ర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. అలాగే హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ గెలుపుకోసం ప్రయ‌త్నిస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా భిన్నమైన ప్రక‌ట‌న‌ల‌తో రాజకీయ నేతలను క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. తాజాగా కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ విష‌యంలో రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌ను స్వీక‌రించారు.

పీసీసీ చీఫ్‌కు రేవంత్‌కు మ‌ద్దతుగా ఛాలెంజ్‌ను స్వీక‌రించి గ‌న్‌పార్క్ వ‌ద్దకు వ‌చ్చారు. ఆ ఛాలెంజ్‌ను మ‌రో ఇద్దరు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్‌, బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేట‌ర్ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ల‌కు విసిరారు. 10 మందికి ఇచ్చే అవకాశం ఉంటే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం,జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న మరికొంతమందికి ఈ సవాల్ విసిరేవాడినని చెప్పారు. ఇలా మొత్తం మీద కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి వ్య‌వ‌హారం.. అంతుచిక్క‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.