Begin typing your search above and press return to search.

కొండ‌గ‌ట్టు మృతుల్ని ఊక‌లో దాచుతారా?

By:  Tupaki Desk   |   13 Sep 2018 12:21 PM GMT
కొండ‌గ‌ట్టు మృతుల్ని ఊక‌లో దాచుతారా?
X
మ‌నుషులేనా?. ఎంత పేదోళ్లు.. సామాన్యులైతే మాత్రం అధికారుల‌కు.. అధికార‌ప‌క్షానికి ఇంత నిర్ల‌క్ష్యం. ఏ సామాన్యుల ఓట్ల కోసం రూ.200కోట్లు త‌గ‌ల‌బెట్టి భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే సామాన్యులు ప్ర‌భుత్వ రంగ సంస్థ చేసిన త‌ప్పున‌కు ప్రాణాల్ని కోల్పోతే.. వారికి గౌర‌వంగా అంతిమ సంస్కారాలు చేయాల్సింది పోయి.. అనాగ‌రికంగా.. అత్యంత దుర్మార్గంగా ఊక‌పొట్టులో ఐస్ గ‌డ్డ‌ల మ‌ధ్య మృత‌దేహాల్ని దాచేస్తారా? ఇంత‌కంటే దుర్మార్గం ఇంకేం ఉంటుంది?

నోరు ఎత్తితే చాలు..స్వాభిమానం కోసం పోరాడి సాధించుకున్నట్లుగా తెలంగాణ గురించి గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్‌.. అధికారులు ఇంత నిర్ద‌య‌గా వ్య‌వ‌హరించటం చూస్తే ఒళ్లు మండిపోవ‌టం ఖాయం. కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాదంలో అర‌వై వ‌ర‌కూ ప్ర‌యాణికులు మ‌రణించ‌టం.. కొంద‌రు మృతుల భౌతిక‌కాయానికి వారి కుటుంబ స‌బ్యులు విదేశాల (గ‌ల్ఫ్‌) నుంచి రావాల్సిన కార‌ణంగా అంతిమ సంస్కారాలు చేయ‌కుండా ఉంచారు.

అలాంటి వేళ‌.. భౌతిక‌కాయాన్ని ఫ్రీజ‌ర్ బాక్సులో ఉంచే స్తోమ‌త లేని ప‌రిస్థితి. దీంతో.. ఐసు గ‌డ్డ‌ల్ని తీసుకొచ్చి.. వాటి మ‌ధ్య‌లో మృత‌దేహాల్ని పెట్టి.. ఐస్ గ‌డ్డ‌లు త్వ‌ర‌గా క‌ర‌గ‌కుండా ఉండేందుకు పెద్ద ఎత్తు ఊక‌ను కుప్ప‌లా పోసేశారు. దాని ముందే బాధితులు కూర్చుండిపోయారు.

రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల మ‌ధ్య‌లో ఒక ఫ్రీజ‌ర్ బాక్సు అద్దె ఉంటుంది. బాధిత కుటుంబాల‌కు ఆ స్తోమ‌త లేకుంటే ఆ బాధ్య‌త‌ను తీసుకోవాల్సింది అధికారులు. కానీ.. వారు ఇవేమీ ప‌ట్టించుకోకుండా..పోస్ట్ మార్టం త‌ర్వాత వారి దేహాల్ని బాధిత కుటుంబాల‌కు అప్ప‌జెప్పి చేతులు దులిపేసుకున్న వైనం చూస్తే క‌డుపు త‌రక్కుపోవ‌టం ఖాయం.

ముంద‌స్తు కార‌ణంగా ఇప్పుడు ప్ర‌భుత్వం లేన‌ప్ప‌టికీ.. అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ కేసీఆర్ కు ఏ మాత్రం ధ‌ర్మం ఉన్నా.. వెంట‌నే ఇంత అమానుషంగా వ్య‌వ‌హ‌రించే వారి విష‌యంలో సీరియ‌స్ కావాల్సింది.

ప్ర‌స్తుతం త‌న‌దైన బిజీలో ఉన్న కేసీఆర్ ఫాం హౌస్ లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండిపోయారు. త‌న క‌న్నీళ్ల లేఖ‌ను.. సంతాప ప్ర‌క‌ట‌న‌ను ఇవ్వ‌టం ద్వారా చేతులు దులిపేసుకున్నట్లుగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారు. ఉమ్మ‌డి పాల‌కుల హ‌యాంలో ప్ర‌జ‌ల ప్రాణాల ప‌ట్ల ఏ మాత్రం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఆవేశ ప‌డే కేసీఆర్‌.. తాను సాధించిన తెలంగాణ‌లో తానే ముఖ్య‌మంత్రిగా (అప‌ద్ధ‌ర్మ‌) ఉన్న వేళ‌.. ఇంత‌టి అమానుషాన్ని చూస్తూ ఎందుకు ఉండిపోయిన‌ట్లు? ఆయ‌న‌లోని ఉద్య‌మ నేత ఏమ‌య్యారు?