Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి ముప్పు: క‌న్నెర్ర చేస్తున్న కొండ‌వీటి వాగు

By:  Tupaki Desk   |   15 Oct 2017 12:57 PM GMT
అమ‌రావ‌తికి ముప్పు: క‌న్నెర్ర చేస్తున్న కొండ‌వీటి వాగు
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌మాదం పొంచి ఉందా? గ‌తంలో నిపుణులు, ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత‌లు హెచ్చ‌రించిన విధంగా అమ‌రావ‌తిని చుడుతూ ప్ర‌వ‌హించే కొండ‌వీటి వాగుతో ఇప్పుడు ప్ర‌మాదం ముంచుకొచ్చిందా? ఇదే జ‌రిగితే సీఎం చంద్ర‌బాబు క‌లల రాజ‌ధాని వ‌ర‌ద‌లో మున‌గ‌డం ఖాయ‌మా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా రాష్ట్రంలో ఊపందుకున్న వ‌ర్షాలు నిన్న‌టి వ‌ర‌కు రాయ‌ల‌సీమ జిల్లాల‌ను అత‌లాకుత‌లం చేశాయి. ఇక‌, ఇప్పుడు వ‌ర్షాల దిశ మారింది. రాజధాని దిశ‌గా మేఘాలు క‌దిలాయి. దీంతో గత రెండు రోజులుగా రాజ‌ధాని ప్రాంతాలైన‌ పల్నాడు సహా, గుంటూరు, సత్తెనపల్లి, పత్తిపాడు, పెదకూరపాడు, తాడేపల్లి, ఉండవల్లి తదితర ప్రాంతాల్లో వ‌ర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నాయి.

దీంతో అమరావతిని చుడుతూ ప్రవహించే కొండవీటి వాగుకు వ‌ర‌ద పొటెత్తింది. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా కొండ‌వీటి వాగులో భారీ ఎత్తున వ‌ర‌ద నీరు ప్ర‌వేశిస్తోంది.దీంతో ఇప్ప‌టికే వందలాది ఎకరాల పంట నీట మునిగింది.,చిన్న చిన్న కాలువలు పొంగి పొరలుతుండగా, పలు చప్టాలపై నీరు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు మేరకు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, తాజా వర్షాలతో పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని అధికారులు తెలిపారు. నాలుగు గంటల వ్యవధిలో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.

మ‌రోప‌క్క‌, కుమ్మరిపాలెం వద్ద వాగు పొంగి అచ్చెంపేట - క్రోసూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మత్తాయిపాలెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక అధికారులు తెలిపారు. అయితే, సీఆర్ డీఏ అధికారు లకు మాత్రం ఈ వ‌ర్షాలు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. కొండ‌వీటి వాగు పెరిగి అమ‌రావ‌తి మునిగితే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని వారు క్ష‌ణ‌మొక యుగంగా గ‌డుపుతున్నార‌ని స‌మాచారం.