Begin typing your search above and press return to search.

రాజ‌ధానిలో 10 వేల ఎక‌రాల‌కు ముంపు ముప్పు

By:  Tupaki Desk   |   7 Sep 2015 6:17 AM GMT
రాజ‌ధానిలో 10 వేల ఎక‌రాల‌కు ముంపు ముప్పు
X
అమ‌రావ‌తిలో ప‌ది వేల ఎక‌రాలు ముంపున‌కు గుర‌వుతాయా అంటే ఔన‌నే అంటున్నాయ్ సీఆర్‌ డీఏ వ‌ర్గాలు. సీఆర్‌ డీఏ ప‌రిధిలోని తుళ్లూరు, తాడికొండ మండ‌లాల్లో కొండ‌వీటి వాగు ప్ర‌యాణిస్తోంది. ఈ వాగు 29.50 కిలోమీట‌ర్ల పొడ‌వున ప్ర‌యాణించడం వ‌ల్ల 7,300 క్యూసెక్కుల వ‌ర‌ద నీరు రాజ‌ధాని మీదుగా ప్ర‌వ‌హించ‌డం త‌థ్యం. ఈ వాగు ప్ర‌వాహ ఉధృతికి 13,500 ఎక‌రాలు ఏటా ముంపున‌కు గుర‌వుతున్నాయ‌ని, అందులో ప‌దివేల ఎక‌రాలు రాజ‌ధాని ప‌రిధిలో ఉన్నాయ‌ని అధికారులు లెక్కుల తేల్చారు. వ‌ర‌ద తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు హైడ్రాల‌జిక్ క‌న్సల్టెంట్ ను నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కొండ‌వీటి వాగు వ‌ర‌ద ఉద్ధృతిని నియంత్రించేందుకు సంబంధిత స‌ర్వే ను న‌వంబ‌ర్‌ లోగా పూర్తిచేయాలని యంత్రాంగం భావిస్తోంది.

ఈ వాగు ప్ర‌వాహాన్ని క‌ట్ట‌డి చేసేందుకు మూడు నాలుగు చోట్ల మినీ రిజ‌ర్వాయ‌ర్‌ ల‌ను నిర్మించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఈ నీటిని రాజ‌ధాని అవ‌స‌రాల‌కు వాడుకోనున్నారు. అంతేకాక రాజ‌ధాని నిర్మాణ ప్రాంతంలో 53వేల ఎక‌రాల అట‌వీ భూమిని డీ నోటిఫై చేసి, వీటిని పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, వాణిజ్య‌వేత్త‌ల‌కు కేటాయించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. రైతుల నుంచి భూమి సేక‌రించిన త‌రువాతే అట‌వీ భూముల‌ను డీ నోటిఫై చేస్తామ‌ని కేంద్రం పేర్కొన్న సంగ‌తి విదిత‌మే! గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న అట‌వీ భూమిని డీ నోటిఫై చేసేందుకు స‌ర్కార్ సన్నాహాలు షురూ చేసింది. ఇందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరింది.

రాజ‌ధానిలో పెద్ద ఎత్తున అపార్ట్‌ మెంట్లు, ట‌వ‌ర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏకంగా ప‌దివేల ఎక‌రాల‌కు ముంపు ముప్పు పొంచి ఉండ‌డంతో అది భ‌విష్య‌త్తులో ఎప్ప‌టికైనా ప్ర‌మాదంగానే ఉండ‌నుంది. అందువ‌ల్లే కొండ‌వీటి వాగు ప్ర‌వాహానికి అడ్డుక‌ట్ట వేసి ఈ వ‌ర‌ద నీటిని వాడుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం పెద్ద ప్ర‌ణాళిక‌లే వేస్తోంది.