Begin typing your search above and press return to search.

తీన్మార్ మ‌ల్లన్న‌కు అంత‌సీన్ లేదా?

By:  Tupaki Desk   |   11 Dec 2021 3:30 PM GMT
తీన్మార్ మ‌ల్లన్న‌కు అంత‌సీన్ లేదా?
X
తీన్మార్ మ‌ల్ల‌న్న‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, మీడియాకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. హైదరాబాద్‌కు చెందిన ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగస్టులో చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. సీఎం కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించారన్న కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇది వరకే బెయిల్ మంజూరైంది.

అయితే పెండింగ్‌లో ఉన్న మరో కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే.. ఇప్పుడు తాజాగా తీన్మార్ మ‌ల్ల‌న్న మ‌రోసారి సెంట‌రాఫ్‌ది టాపిక్ అయ్యారు. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ప‌రిణామం.. స‌హజంగానే అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ఆగ్ర‌హం తెప్పించేదే. ఈ క్ర‌మంలో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై ఫైర్ అయ్యారు. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డి.. విమ‌ర్శ‌లు చేశారు. తీన్మార్ మ‌ల్ల‌న్న‌గా పిల‌వ‌బ‌డుతున్న చింత‌పండు న‌వీన్ కుమార్ అస‌లు.. జ‌ర్న‌లిస్టే కాద‌ని.. సంచ‌న వ్యాఖ్య‌లు చేశారు.. మంత్రి ఈశ్వ‌ర్‌.

అంతేకాదు.. తీన్మార్ మ‌ల్ల‌న్న కేవలం టీవీ కార్య‌క్ర‌మాల యాంక‌ర్ మాత్ర‌మేన‌ని చెప్పారు. గ‌తంలో ఏ పేప‌ర్‌లోను, లేదా టీవీ చానెల్‌లోనూ తీన్మార్ మ‌ల్ల‌న్న రిపోర్ట‌ర్‌గా ప‌నిచేసిన దాఖ‌లాలు లేవ‌ని మంత్రి ఈశ్వ‌ర్ చెప్పారు. సంఘ్ ప‌రివార్‌కు చెందిన మ‌ల్ల‌న్న బీజేపీ కోసం.. ఆ పార్టీ అభివృద్ధి కోసం ప‌నిచేశార‌ని అన్నారు. త‌న‌ను తాను అతిగా ఊహించుకునే వ్య‌క్తిత్వం ఉన్న మ‌ల్ల‌న్న‌.. జ‌ర్న‌లిస్టు ముసుగు వేసుకునిఅంద‌రినీ న‌మ్మించార‌ని.. ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వారివ‌ల్ల నిజ‌మైన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా అప‌వాదులు వ‌స్తాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక మ‌త తత్వ పార్టీకి కొమ్ము కాసిన‌.. మ‌ల్ల‌న్న విష‌యంలో జ‌ర్న‌లిస్టులు కూడా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని మంత్రి వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మార‌డం గ‌మ‌నార్హం.