Begin typing your search above and press return to search.

కమ్యునిస్టు గులాబీ కారు ఎక్కొచ్చు కానీ కమలనాథులతో కలవొద్దా కొప్పుల?

By:  Tupaki Desk   |   12 Jun 2021 9:30 AM GMT
కమ్యునిస్టు గులాబీ కారు ఎక్కొచ్చు కానీ కమలనాథులతో కలవొద్దా కొప్పుల?
X
సమయానికి తగ్గట్లు మాట్లాడటం.. సందర్భానికి తగినట్లుగా సిద్ధాంతాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో ఇప్పటి నేతలు ముందుంటారు. పనిలో పనిగా పసలేని వాదనల్ని వినిపించి ప్రజల్లో అభాసుపాలు అవుతుంటారు. తాజాగా అలాంటి పనే చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్. మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో ఇటీవల కాలంలో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బిగ్ బాస్ కంట్లో పడేందుకు వారు పడుతున్న తపన అంతా ఇంతా కాదు.

పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్న వేళ.. కొప్పుల ఈశ్వర్ చెలరేగిపోయారు. ఒకప్పటి తన స్నేహితుడిని తిట్టిపోశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదవులు.. గౌరవాన్ని పొందిన ఈటల.. టీఆర్ఎస్ లో ఉండి పార్టీకి నష్టం చేసే పనులు చేశారన్నారు.

ప్రగతిభవన్ ను బానిసల భవన్ అంటావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈటల కమ్యునిస్టు కదా? బీజేపీలోకి ఎలా చేరుతున్నారు? అంటూ తనకున్న సందేహాన్ని బయటపెట్టారు. కొప్పుల ఈశ్వర్ మాటల్ని విన్నోళ్లంతా విస్మయానికి గురవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏమీ కమ్యునిజం భావాలున్న పార్టీ కాదు. ఆ మాటకు వస్తే.. కామ్రేడ్స్ పై కేసీఆర్ ఎంతలా విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈటల విషయంలో లా పాయింట్ తీసిన కొప్పుల.. టీఆర్ఎస్ లోకి తన జీవిత కాలంలో అత్యధిక సమయాన్ని గడిపిన సీపీఎం పార్టీని వదిలేసి గులాబీ పార్టీలో చేరిన నోముల నర్సయ్యను గుర్తు చేస్తున్నారు. కమ్యునిస్టులు టీఆర్ఎస్ పార్టీలో చేరొచ్చు కానీ.. టీఆర్ఎస్ నేత ఒకరు బీజేపీలోకి చేరటం అంత తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ లాజిక్ కు కొప్పుల మాష్టారు ఏ తీరులో రియాక్టు అవుతారో ?