Begin typing your search above and press return to search.

కొసావో పార్లమెంటులో లగడపాటి అనుచరులు

By:  Tupaki Desk   |   18 Nov 2015 9:45 AM GMT
కొసావో పార్లమెంటులో లగడపాటి అనుచరులు
X
సమైక్యాంధ్రను విడగొట్టడానికి ఉద్దేశించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు 2013లో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి కాంగ్రెస్ తెలుగు ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన చర్యతో అందరినీ షేక్ చేశారు. పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన ఆయన పార్లమెంటులో ఏకంగా పెప్పర్ స్ప్రే చల్లి గందరగోళం చేశారు. తాజాగా యూరప్ లో అలాంటి ఘటనే జరిగింది. ఆగ్నేయ యూరప్ దేశమైన కొసావాలోనూ లగడపాటిలా పెప్పర్ స్ప్రేతో కలకలం సృష్టించారు కొందరు నాయకులు. అయితే... లగడపాటి ఇండియన్ పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లడానికి గల కారణంతో కొసవో పార్లమెంటు ఘటనకూ కొంత పోలిక ఉండడం ఇక్కడ విశేషం.

ఆగ్నేయ ఐరోపా దేశమైన కొసావో రాజధాని ప్రిస్టినాలోని పార్లమెంటులో పాలక, విపక్ష ఎంపీలు ఘర్ణణ పడిన సందర్భంలో కొందరు పెప్పర్ స్ప్రే చల్లారు. సెర్బియాతో ఒప్పందాల విషయంలో చెలరేగిన విభేదాలు, గందరగోళం నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. విపక్ష ఎంపీలు పార్లమెంటు కార్యకలాపాలు అడ్డుకోవడం కోసం దీన్ని చల్లారు. అయితే... పార్లమెంటు లోపల, బయట కూడా కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా పెప్పర్ స్ప్రేను తీసుకెళ్లగలగడం విశేషం. అప్పట్లో లగడపాటి కూడా ఇలాగే పార్లమెంటులోకి భద్రత ఉన్నా పెప్పర్ స్ప్రే తీసుకెళ్లారు.

కాగా కొసావో 2008లో సెర్బియా నుంచి విడివడి స్వతంత్ర దేశమైంది. ఆ నేపథ్యంలో సెర్బియాతో ఉన్న కొన్ని వివాదాల పరిష్కారం, ఒప్పందాలపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య గొడవలో ఈ సంఘటన జరిగింది. లగడపాటి ఇష్యూలోనూ రాష్ట్ర విభజన నేపథ్యం ఉండడం.. ఇక్కడ దేశ విభజన నేపథ్యం ఉండడం కాకతాళీయమే.

అయితే కొసావో పార్లమెంటులో జరిగిన మొత్తం ఘటనను పరిశీలిస్తే నిరసనకు ఎంచుకున్న మార్గం... సభను అడ్డుకోవడానికి అనుసరించిన విధానం.. భద్రత ఉన్నప్పటికీ పెప్పర్ స్ప్రేను పార్లమెంటులోకి తీసుకెళ్లగలగడం.. అసలు పెప్పర్ స్ర్పే వాడాలన్న ఆలోచన రావడం వంటివి చూస్తుంటే కొసావో ప్రతిపక్ష ఎంపీలకు లగడపాటి ఇష్యూ తెలిసినట్లే అనిపిస్తుంది. నిజానికి లగడపాటి ఇష్యూ తెలిసినా తెలియొచ్చు. ఎందుకంటే అప్పట్లో అది ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించి దాదాపు అన్ని దేశాల్లో మీడియాలో కవరైంది.