Begin typing your search above and press return to search.

కోటం రెడ్డి బిగ్ వాయిస్ : అభివృద్ధి లేదు... ఎవరూ పట్టించుకోరు...

By:  Tupaki Desk   |   6 July 2022 4:49 PM GMT
కోటం రెడ్డి బిగ్ వాయిస్ :  అభివృద్ధి లేదు... ఎవరూ పట్టించుకోరు...
X
అన్నా జగనన్నా అంటూ వెంట తిరిగే వారిలో ఆయనదే అగ్ర తాంబూలం. అలాంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టోన్ ఇపుడు మారింది. ఆయన జనం వైపు నుంచి నిలిచి మాట్లాడుతున్నారు. తన నియోజకవర్గాన ఏమి అభివృద్ధి లేదు, ఎవరూ అసలు పట్టించుకోరు అని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. నిజానికి ఈ మాటలు ప్రతిపక్షాలు ఇప్పటిదాకా అంటూ వచ్చాయి.

దానికి అటు వైపు నుంచి కౌంటర్లు పడుతూ వచ్చాయి. కానీ ఇపుడు పూర్తిగా సీన్ మారింది. కోటం రెడ్డి బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఏదండీ అభివృద్ధి అని ఆయన నిలదీసి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. తమ ప్రభుత్వంలోనే పనులు జరగడంలేదని వాపోతున్నారు. ఒకింత ఆగ్రహం కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన తన నియోజకవర్గంలో మురుగు కాలువలో దిగి నిరసన తెలియచేసిన సంగతి విధితమే.

నెల్లూరు కార్పోరేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఈ కాలువ సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహించిన శ్రీధర్ రెడ్డి ఏకంగా మురుగు కాలువలో కాలు పెట్టేసి కూర్చుని నిరసన తెలిపారు. ఇపుడు ఆయన మరింత ముందుకు జరిగి అధికారుల తీరు మీద నిప్పులే చెరిగారు. ఏ పనులూ కావడం లేదని మండిపడ్డారు.

జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల గురించి నెలల తరబడి తిరిగినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు నెల్లూరు నగరంలో రోడ్లు అన్నీ గుంతలతో నిండి ఉంటున్నాయని. అడుగు తీసి అడుగు వేయాలీ అంటేనే దారుణమని ఆయన గట్టిగానే చెప్పుకొచ్చారు. మురుగు కాలువల నిర్వహణ తీరు అధ్వాన్నమ‌ని కూడా వాపోయారు.

మరి విపక్ష ఎమ్మెల్యేలు ఈ తరహా కామెంట్స్ చేస్తే లైట్ తీసుకోవడమో లేక కౌంటర్ అటాక్ చేయడమో ప్రభుత్వ వర్గాలు చేస్తాయి. కానీ తమ పార్టీ ఎమ్మెల్యే నోటి వెంట నిజాలు అలా తన్నుకుని వస్తూంటే తమ వాడే నిగ్గదీసి అడుగుతున్న తీరుతో జనాల్లో చర్చ సాగుతుంటే అధికార వైసీపీ పెద్దలు ఏమి సమాధానం చెబుతారో.

ఏది ఏమైనా కోటం రెడ్డి శ్రీధర్ ఒక వైపే చూశారు, ఇపుడు తనలో రెండవ కోణాన్ని చూడమని అంటున్నారు. ప్రజా నాయకుడిగా గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఆయన విప్పి చెబుతున్నారు. సర్కార్ వారు ఏమంటారో మరి.