Begin typing your search above and press return to search.

కోటంరెడ్డికి సీఎం అపాయింట్‌మెంట్ లేకే అమ‌రావ‌తి రైతుల‌ను క‌లిశారా...!

By:  Tupaki Desk   |   1 Dec 2021 12:30 PM GMT
కోటంరెడ్డికి సీఎం అపాయింట్‌మెంట్ లేకే అమ‌రావ‌తి రైతుల‌ను క‌లిశారా...!
X
అమ‌రావ‌తి రైతుల న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పాద‌యాత్రకు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్న యాత్ర‌కు తాత్కాలికంగా చిన్న బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ యాత్ర చేస్తోన్న రైతులు అంద‌రూ నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌స చేస్తున్నారు.

వీరిని నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి క‌ల‌వ‌డం రాజ‌కీయంగా పెద్ద సంచ‌ల‌నం రేపింది. ఓ వైపు జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహారించుకోవ‌డంతో పాటు అందులో ఉన్న చిక్కుల‌ను స‌రిచేసి మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లు అసెంబ్లీ ముందుకు తీసుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్పారు.

అలాంటి స‌మ‌యంలో అమరావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని పాద‌యాత్ర చేస్తోన్న వారిని కోటంరెడ్డి క‌ల‌వ‌డంతో పాటు మీకు ఏ ఇబ్బంది వ‌చ్చినా తాను ఉన్నాన‌ని హామీ ఇవ్వ‌డం వైసీపీ వ‌ర్గాల‌కు మింగుడు ప‌డ‌డం లేదు.

గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం ముందుగా డిజైన్ చేసిన ఘ‌న‌త కూడా కోటంరెడ్డిదే. అసెంబ్లీలోనూ, బ‌య‌ట జ‌గ‌న్‌, వైసీపీ వాయిస్ బ‌లంగా వినిపించే ఎమ్మెల్యేల‌లో కోటంరెడ్డి ఒక‌రు. జ‌గ‌న్ మఈద అసెంబ్లీలో ఆయ‌న ఈగ వాల‌నివ్వ‌రు.

అలాంటి శ్రీథ‌ర్ రెడ్డి టీడీపీ, బీజేపీ స‌పోర్ట్ చేస్తోన్న అమ‌రావ‌తి కోసం పాద‌యాత్ర చేస్తోన్న రైతుల‌ను క‌లిసి స‌పోర్ట్ చేయ‌డంతో ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌ని మిస్ట‌రీగా మిగిలింది. అయితే సీఎం మీద త‌న అస‌హ‌నాన్నే ఆయ‌న ఈ విధంగా చూపించార‌ని జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల ఆయ‌న సీఎం అపాయింట్‌మెంట్ అడిగిన‌ట్టు తెలుస్తోంది. రెండు మూడు సార్లు కూడా సీఎం అపాయింట్‌కోసం ఆయ‌న విఫ‌ల ప్ర‌య‌త్నం చేయ‌డంతో కాస్తంత అస‌హ‌నంతో ఉన్నార‌ని అంటున్నారు. పైగా మంత్రి వర్గంలో ఆశ‌ల‌తో ఉన్నారు. ఇవేవి జ‌రిగేలా ఆయ‌న‌కు క‌న‌ప‌డ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే అమరావ‌తి రైతుల‌ను క‌లిస్తే పార్టీలో హాట్ టాపిక్ అవ్వ‌డంతో పాటు క‌నీసం హై క‌మాండ్ అపాయింట్‌మెంట్ అయినా దొరుకుతుంద‌నే ఆయ‌న ఇలా చేశార‌ని స్థానికంగా గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.

కోటంరెడ్డి నిజానికి ప్ర‌జ‌ల మ‌నిషే. ఆయ‌న ముందు నుంచే ప్ర‌జ‌ల్లో ఉంటారు. అందుకే గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ మంచి మెజార్టీతో గెలిచారు. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీస అభివృద్ధి కూడా జ‌ర‌గ‌లేదు. పేరుకు రెండుసార్లు గెలిచిన సీనియ‌ర్ ఎమ్మెల్యే అయినా.. చాలా ర‌హ‌దారులు అధ్వానంగా ఉన్నాయి.

పై నుంచి నిధులు లేవు. జ‌నాల‌కు ఏం చెప్పుకోవాలో తెలియ‌డం లేదు. ఇదే ప‌రిస్థితి ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు డౌటే..! ఇవేవి అధిష్టానానికి ప‌ట్ట‌వు.. వాళ్లు ప‌ట్టించుకోరు. అందుకే తాను అమ‌రావ‌తికి ఇన్‌డైరెక్టుగా స‌పోర్ట్ చేస్తున్నా అని చెప్పే ప్ర‌య‌త్నమే ఆయన చేస్తున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది.