Begin typing your search above and press return to search.

ఆ మహిళా ఎంపీ ఆలోచన ఏంటో!

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:30 AM GMT
ఆ మహిళా ఎంపీ ఆలోచన ఏంటో!
X
ఒకవైపు తెలుగుజాతి మొత్తం రాష్ట్రానికి జరిగిన అన్యాయం నుంచి తేరుకుని లేచి నిలబడడం ఎలాగా? అని ఆలోచిస్తోంది. రాజకీయ పార్టీలు తమ సొంత మైలేజీ కూడా చూసుకోవడం సహజమే అయినా.. రాష్ట్రప్రయోజనాలు అన్నింటికంటె ఎక్కువ అనే ఉద్దేశంతో అందరూ దాదాపుగా ఒకటే మాటకు కట్టుబడుతున్నారు. ఎలాగైనా కేంద్రంనుంచి మనకు రావాల్సినవన్నీ సాధించుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఇంత వ్యవహారం నడుస్తోంటే.. ‘రాష్ట్ర్ర అభివృద్ధి కోసం బిచ్చగాళ్ల మాదిరిగా కేంద్రం వద్ద చేయిచాచి అడుక్కోవడం దురదృష్టకరం’ అని గౌరవనీయురాలైన ఓ మహిళా ఎంపీ సెలవిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యల ద్వారా తాను ఎంత బుర్ర తక్కువ నాయకురాలినో.. ప్రపంచానికి ఆమె స్వయంగా చాటుకుంటున్నారని ప్రజలు ఆమెపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాట ఒక్కటే కాదు.. ‘‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని అనుకునేవారు.. ఇలా అడుక్కోరాదు’’ అని కూడా సదరు మహిళా ఎంపీ గారు నీతులు చెబుతున్నారు. ఇంతకూ ఆ మహిళా ఎంపీ మరెవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున విజయం సాధించి.. తెలుగుదేశం లోకి ఫిరాయించి.. లోక్ సభలో అనర్హత వేటు భయంతో.. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా మెలగుతున్న అరకు ఎంపీ కొత్తపల్లి గీత.

విభజన హామీల అమలు గురించి కేంద్రంతో చేస్తున్న పోరాటం అనేది ఆమెకు బిచ్చమెత్తుకోవడం లాగా కనిపిస్తోందా అని ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం గురించి ఆమెకు అర్థమైంది ఇదేనా అని అనుకుంటున్నారు. విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి సంక్రమించేవి అన్నీ కూడా ఏపీ యొక్క హక్కు అవుతాయే తప్ప.. ఇందులో ఎవరి దయా ధర్మమూ లేదని - ఇది యాచించడం కాదని.. ఆ మాత్రం ఎంపీగారికి అవగాహన లేదా అనేది ప్రజల ఆవేదన.

లోక్ సభలో తెదేపా - వైకాపా ఎంపీలంతా గళమెత్తి పోరాడుతోంటే.. గీత గారు అన్నిరోజులూ అపరిమతమైన మౌనం పాటించారు. వైకాపా నుంచి ఫిరాయించారు గనుక వారితో కలవక - తెదేపాతో కలిసి నిలిస్తే అనర్హత వేటు పడవచ్చుననే భయంతో అసలు రాష్ట్రం కోసం ఏమీ మాట్లాడని గౌరవ ఎంపీలుగా కొత్తపల్లి గీత - బుట్టా రేణుక ముద్ర పడ్డారు. రాష్ట్ర ప్రజలంతా వీరిని ఛీత్కరించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఎదుట తన ఇమేజీ కాపాడుకోవడానికి, తనలా మౌనంగా ఉండడమే కరెక్టు అని చాటుకోవడానికి ఆమె తపన పడడం తప్పు కాదు. కానీ కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోడానికి జరిగే ప్రయత్నాన్ని యాచనగా అభివర్ణించే బుర్ర తక్కువ ఆలోచన ఎందుకు చేశారనేదే ప్రజలకు అర్థం కావడం లేదు.

ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని అంటూ ఆమె చంద్రబాబుకు కూడా చురకలు వేస్తున్నారు. మరి పెద్దనోటు స్థాయి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో.. వాటిద్వారా రాష్ట్రానికి నిధులు సాధించడం ఎలాగో ఆమె నిరూపించవచ్చు కదాని ప్రజలు అనుకుంటున్నారు.