Begin typing your search above and press return to search.
కొత్తపల్లి మాట!... టీడీపీకి క్లారిటీ లేదు!
By: Tupaki Desk | 13 Feb 2018 12:32 PM GMTకొత్తపల్లి గీత... గడచిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా అరకు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఫస్ట్ టైం ఎంపీగా ఎన్నికైన మహిళా నేత. అయితే 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ అదికారంలోకి రాకపోయే సరికి ప్లేట్ పిరాయించేసిన గీత... టీడీపీకి దగ్గరగా జరిగారు. అయితే ఇప్పటిదాకా టీడీపీలో చేరినట్లుగా ఎక్కడ కూడా ప్రకటన చేయకుండా చాలా జాగ్రత్తగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న గీత... ఇప్పుడు దాదాపుగా యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. మొన్న కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులేమీ లేని నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీడీపీ ఒంటికాలిపై లేచిన వైనంపై రంగంలోకి దిగేసిన కొత్తపల్లి గీత... తనదైన స్టైల్లో వైసీపీతో పాటుగా టీడీపీని ఉతికి ఆరేశారనే చెప్పాలి.
మొత్తంగా వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన గీత...టీడీపీకి దగ్గరగా జరిగి కూడా ఆ పార్టీలో చేరకుండా ఇప్పుడు కొత్తగా బీజేపీ పంచన చేరిపోతున్నట్లుగా వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీకి న్యాయం, అన్యాయంపై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే... దానిలోకి కూడా ఎంట్రీ ఇచ్చిని గీత... టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేశారని చెప్పక తప్పదు. అసలు ఏపీకి న్యాయం చేయమని కేంద్రాన్ని ఏం అడగాలో కూడా టీడీపీకి అర్థం కావడం లేదన్న మాట వినిపించిన గీత... టీడీపీకి పెద్ద షాకే ఇచ్చారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో టీడీపీకి స్పష్టత లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా అంతా రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయో కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడాలని, ప్రజల్ని నష్టపరచకుండా నాయకులు వ్యవహరించాలని సూచించారు. రైల్వేజోన్ విశాఖకు రావాలని, అది విశాఖ ప్రజల హక్కు అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. విజయవాడకు ఎయిమ్స్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని చెప్పిన గీత... అన్ని సంస్థలు విజయవాడ - అమరావతికే వెళ్తున్నాయని - ఉత్తరాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా తనదైన శైలి కామెంట్లతో టీడీపీకి పంటి కింద నలుసులాగే గీత వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదేమో.